Vijay Deverakonda: ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ఒక దర్శకుడు ఒక హీరో కోసం కథ రాసుకుంటే, ఆ హీరో కాల్షీట్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూసేవారు. కానీ ఇప్పుడు యంగ్ హీరోల హవా పెరగడంతో, కథలు ఒక హీరో నుండి మరో హీరో వద్దకు వేగంగా మారుతున్నాయి. తాజాగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఖాతాలోకి ఇలాంటి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది.
నాని ‘నో’.. విజయ్ ‘యస్’?
‘హాయ్ నాన్న’ చిత్రంతో క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించిన దర్శకుడు శౌర్య, తన తర్వాతి కథను ముందుగా నేచురల్ స్టార్ నాని కోసం సిద్ధం చేసుకున్నారు. అయితే, నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ యాక్షన్ డ్రామా ‘ద పారడైజ్’ (The Paradise – ఆగస్టు 21, 2026న విడుదల) మరియు సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ చిత్రాల్లో నాని నటిస్తున్నారు.నాని డేట్స్ దొరకడం ఆలస్యం అవుతుండటంతో, శౌర్య ఆ కథలో కొన్ని మార్పులు చేసి విజయ్ దేవరకొండకు వినిపించారని, దానికి విజయ్ సానుకూలంగా స్పందించారని సమాచారం.
నితిన్ కోసం రాసిన ‘స్వారి’.. ఇప్పుడు విజయ్ ఖాతాలోకి!
కేవలం శౌర్య కథ మాత్రమే కాదు, వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు విక్రమ్ కె. కుమార్ రాసుకున్న కథ కూడా విజయ్ వద్దకే చేరింది.
గుర్రపు స్వారీ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాకు ‘స్వారి’ (Swari) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నిజానికి ఈ సినిమా హీరో నితిన్‌తో చేయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఈ వైవిధ్యమైన కథను విజయ్ దేవరకొండ చేయబోతున్నారు.
ఫుల్ బిజీగా రౌడీ స్టార్
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు:
-
రణబాలి (Ranabaali): ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌తో కలిసి చేస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా సెప్టెంబర్ 11, 2026న విడుదల కానుంది. ఇందులో రష్మిక మందన్న కథానాయిక.
-
రౌడీ జనార్దన (Rowdy Janardhana): రవికిరణ్ కోలా దర్శకత్వంలో పక్కా మాస్ రూరల్ యాక్షన్ డ్రామాలో విజయ్ నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా, దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
