Vijay Devarakonda ‘ ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తుల తాకిడి. సామాన్య భక్తులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఈ పవిత్ర ఘట్టానికి హాజరవుతున్నారు. ఎంతా అర్జెంట్ పనులు ఉన్నా వాటిని వాయిదా వేసుకొని, కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ఇప్పటికే సినీ ప్రముఖులైన సంయుక్త మీనన్, యాంకర్ లాస్య, బిందు మాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తదితరులు మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానాలు చేశారు.
విజయ్ దేవరకొండకు ఊహించని అనుభవం
ఇటీవల టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తన తల్లితో కలిసి మహా కుంభమేళాకు బయలుదేరారు. అయితే ఆయన ప్రయాణం అంత సజావుగా సాగలేదు. ఆయన వెళ్తున్న విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ కాకపోవడంతో కొంతసేపు ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి చూడాల్సి వచ్చింది.
ఈ విమానంలో విజయ్ దేవరకొండతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ప్రయాణిస్తున్నారు. ఫ్లైట్ ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో వాగ్వాదానికి దిగారు. అయితే అన్ని అడ్డంకులను అధిగమించి విజయ్ చివరికి కుంభమేళాకు చేరుకున్నారు.
కాషాయ వస్త్రధారణలో రౌడీ హీరో
త్రివేణి సంగమానికి చేరుకున్న విజయ్ దేవరకొండ, కాషాయ వస్త్రాలు ధరించి, రుద్రాక్ష మాల కట్టుకుని, తన తల్లితో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, రౌడీ హీరో భక్తి పరవశంలో మునిగిపోయాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.