Vidudala Rajini

Vidudala Rajini: పక్కా సాక్ష్యాలతో అరెస్ట్‌కి రంగం సిద్ధం?

Vidudala Rajini: వైసీపీ మాజీ మంత్రి విడుదల రజినీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమెపై వస్తోన్న అవినీతి ఆరోపణలు, కేసులు, బాధితుల వాదనలు, రజినీ వెర్షన్ – ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు ఎవరీ విడుదల రజనీ అన్నది తెలియాలి. విడదల రజనీ చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. గెలుపొందిన కొద్ది రోజులకే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా జాక్‌ పాట్‌ కొట్టేశారు. ఐదేళ్లలోనే చిలుకలూరుపేటలో ఆమె అవినీతి, అరాచకాలు పీక్స్‌కు చేరాయని ఆరోపణలు రావడంతో… వైసీపీ అధిష్టానం ఆమెను గుంటూరు వెస్ట్‌కు బదిలీ చేసింది. అక్కడ ఆమె ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే ఎన్నికల తర్వాత వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి మళ్లీ చిలుకలూరుపేటకు వచ్చేశారు. ఇప్పుడు ఆమెపై అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

విడదల రజినిపై ఇప్పటివరకు ఏసీబీ కొన్ని కీలక కేసులు నమోదు చేసింది. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు చిలకలూరిపేట సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆమె నేరుగా లేదా పరోక్షంగా పాల్గొన్నట్లు ఏసీబీ సాక్ష్యాలు సేకరించినట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ ఆమె ఆస్తుల వివరాలను సేకరించి, వాటి మూలాలను పరిశీలిస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగాని పాల్పడి… కాంట్రాక్టులు, అనుమతుల విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి.

Vidudala Rajini: చిలకలూరిపేటలో వ్యాపారులు, రైతుల నుంచి అక్రమ వసూళ్లు చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. ఇది ఆమె ఆదేశాలతోనే జరిగిందని వ్యాపార వర్గాలు ఆరోపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రజనీ ట్యాక్స్‌ కట్టందే పనులు జరిగేవి కావని స్థానిక ప్రజలే చెప్తున్నారు. ఈ డబ్బు రజనీ పీఏ ద్వారా ఆమెకు చేరేదని బాధితులు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సామాన్య ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, తన సొంత లాభం కోసం పనిచేశారని స్థానికులు వాపోతున్నారు.

విడదల రజనీ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, తన వాదనను వినిపిస్తున్నారు. ఏసీబీ కేసులు పూర్తిగా రాజకీయ కుట్రలని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవనీ, కేవలం ఓరల్ ప్రూఫ్స్ మాత్రమే ఉన్నాయని రజనీ అంటున్నారు. కూటమి తనని టార్గెట్ చేసి, రెడ్ బుక్‌లో పేరు ఉండటం వల్లే ఈ కేసులు పెట్టించిందని ఆరోపిస్తున్నారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలు తనపై వ్యక్తిగత కక్షతో ఈ కేసులు పెట్టించారనీ, ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకారం అని వాదిస్తున్నారు. రజనీ వాదన ఎలా ఉన్నా.. ఆమె అవినీతిలో లిప్తమైనట్లు చాలా సంకేతాలే కనిపిస్తున్నాయి.

Also Read: TS Honey Trap: అరెరె..ఆ కాల్ మీకూ వచ్చిందా?

Vidudala Rajini: ప్రధానంగా ఆమె పీఏ ద్వారా లంచాలు తీసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఆమె స్వయంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్లి హడావుడి చేసిన సంఘటన.. అక్కడి అవినీతిలో ఆమె ప్రమేయాన్ని సూచిస్తోందని పరిశీలకులు సైతం భావిస్తున్నారు. రాజకీయ జీవితం మొదలుపెట్టిన తర్వాత ఆస్తులు గణనీయంగా పెరగడం, దానికి సరైన వివరణ లేకపోవడం అవినీతి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఆమె “రాజకీయ కుట్ర” అని ఎంత చెప్పినా, ఏసీబీ మాత్రం సాక్ష్యాల సేకరణలో దూకుడుగా ఉంది.

2020లో యడ్లపాడులోని శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి, రూ.2 కోట్ల 20 లక్షలు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో A1గా విడదల రజనీని, A2గా అప్పటి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పల్లె జాషువాను పేర్కొంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 1988 కింద ఏసీబీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఏసీబీ ఇప్పటికే స్టోన్ క్రషర్ యజమాని నుంచి ఫిర్యాదు స్వీకరించి, ఆ ఆరోపణలను ధృవీకరించే సాక్ష్యాలను సేకరించినట్లు తెలుస్తోంది.

బ్యాంకు లావాదేవీలు, ఫోన్ కాల్ రికార్డులు ఈ దర్యాప్తులో కీలకంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలో పాల్గొన్న కొందరు స్థానిక వ్యాపారులు, అధికారులు ఏసీబీకి సాక్ష్యాలు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు రజనీ లేదా ఇతర ఆరోపితులను అరెస్ట్ చేయలేదు కానీ, దర్యాప్తు తీవ్ర స్థాయిలో సాగుతోంది. ఏసీబీ ఈ కేసును ఆధారాలతో రుజువు చేస్తే, రజనీ రాజకీయ భవిష్యత్తుతో పాటు వైసీపీ ఇమేజ్‌కు కూడా గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *