Vidadala Rajini

Vidadala Rajini: మాపై దాడులు చేసి.. మళ్ళీ మాపైనే కేసులా? కూటమి ప్రభుత్వంపై విడదల రజని ఫైర్!

Vidadala Rajini: రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడుల పట్ల మాజీ మంత్రి విడదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దానిపై నిలదీసినందుకే వైసిపి నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి సీనియర్ నాయకులపై హత్యాయత్నాలకు పాల్పడటం దారుణమని, స్థానిక ఎమ్మెల్యేల అండతోనే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ఆమె ఆరోపించారు.

చిలకలూరిపేటలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. లడ్డూ విషయంలో చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలని, దేవుడి సాక్షిగా నిలదీసేందుకు తాము పూజలు చేయడానికి వెళ్తే, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దగ్గరుండి దాడులు చేయించారని విడదల రజని పేర్కొన్నారు. “మాపై భౌతిక దాడులు చేయడమే కాకుండా, తిరిగి మా పైనే కేసులు పెట్టడం ఏంటి?” అని ఆమె ప్రశ్నించారు. ఒక బీసీ మహిళగా, మాజీ మంత్రిగా ఉన్న తనకే రక్షణ లేకపోతే, రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా చంద్రబాబు ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తోందని ఆమె విమర్శించారు. వైసీపీ నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబులు వేయడం, మహిళలపై దాడులు చేయడం వంటివి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వంటి వారు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి నిదర్శనమని రజని పేర్కొన్నారు. లడ్డూ విషయంలో వైసీపీ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని సీబీఐ ఛార్జ్ షీట్ ద్వారా స్పష్టమైందని, అది జీర్ణించుకోలేకనే ఈ దాడులకు తెగబడుతున్నారని ఆమె మండిపడ్డారు.

చివరగా, అధికార పార్టీ నేతలకు ఆమె గట్టి హెచ్చరిక జారీ చేశారు. “అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, రేపు అనే రోజు ఒకటి ఉంటుందని గుర్తుంచుకోండి” అంటూ విడదల రజని హెచ్చరించారు. ప్రజలకు మంచి పాలన అందించడం మానేసి, ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలే బుద్ధి చెబుతారని, తప్పు చేస్తే ప్రశ్నిస్తూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *