Vice President: భారతదేశ నూతనంగా 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం (సెప్టెంబర్ 12) ఉదయం 10 గంటలకు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు.
Vice President: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గతంలో మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగారు. ఉపరాష్ట్రపతిగా గెలుపొందాక, తాజాగా ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను ఆచార్య దేవవ్రతకు రాష్ట్రపతి అప్పగించారు. గత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
Vice President: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులనూ ఆహ్వానించారు. ఈ మేరకు మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, జగదీప్ ధన్‌ఖడ్ కూడా హాజరవడం గమనార్హం. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాన నిలబడిన సీపీ రాధాకృష్ణన్.. ఇండియా కూటమి తరఫున పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

