Kamini Kaushal: హిందీ చలనచిత్ర పరిశ్రమకు తొలి తరం హీరోయిన్ కామినీ కౌశల్. 98 ఏళ్ల వయసులో ముంబయిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం సినీ ప్రముఖులను కలచివేసింది. 1946లో ‘నీచా నగర్’తో వెండితెరకు పరిచయమైన కామినీ కౌశల్ ఒక్కసారిగా స్టార్‌గా ఎదిగారు. దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, అశోక్ కుమార్‌లతో నటించి 40వ దశకంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణిగా నిలిచారు. ‘ఆగ్’, ‘దో భాయ్’, ‘నదియా కే పార్’, ‘అర్జూ’ వంటి చిత్రాలు ఆ రోజుల్లో బ్లాక్‌బస్టర్లయ్యాయి. 1963 తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె ‘దో రాస్తే’, ‘పురబ్ ఔర్ పశ్చిమ్’, ‘రోటీ కపడా ఔర్ మకాన్’లో తల్లి పాత్రలతో మెప్పించారు. షారుఖ్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో అమ్మమ్మగా, ఆమిర్ ‘లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్రలో కనిపించి కొత్త తరాన్ని ఆకట్టుకున్నారు. వ్యక్తిగత జీవితంలోనూ ధైర్యం చాటిన కామినీ అక్క మరణం తర్వాత ఆమె భర్తను వివాహం చేసుకుని బిడ్డలను పోషించారు. ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌తో పాటు అనేక పురస్కారాలు అందుకున్న ఈ చిరస్థాయి నక్షత్రం ఆరిపోవడం హిందీ సినీ చరిత్రలో శూన్యతగా మిగిలింది.

