Venigula: మా దేశ అధ్యక్షుడు కనిపించట్లేదు.. ఉపాధ్యక్షురాలు ఓపెన్ స్టేట్మెంట్

Venigula: వెనెజులాలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. అమెరికా సైన్యం దాడుల తర్వాత దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ఆచూకీ తెలియడం లేదని వెనెజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ సంచలన ప్రకటన చేశారు. మదురో దంపతులు బతికే ఉన్నారో లేదో స్పష్టం చేయాలని ఆమె అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెనెజులానా డి టెలివిజన్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్థానిక పత్రిక ‘ఎల్ నేషనల్’ తెలిపింది.

అమెరికా దాడుల నేపథ్యంలో దేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలు, సైన్యం ఐక్యంగా ముందుకు రావాలని డెల్సీ రోడ్రిగ్జ్ పిలుపునిచ్చారు. వెనెజులా సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించిన ప్రభుత్వం ప్రజలను శాంతిగా, ధైర్యంగా ఉండాలని కోరింది.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై కీలక ప్రకటన చేశారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా బలగాలు పట్టుకుని దేశం వెలుపలకు తరలించాయని ట్రంప్ తెలిపారు. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ఆపరేషన్‌ను అమెరికా చట్ట అమలు సంస్థల సహకారంతో నిర్వహించామని చెప్పారు.

ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలను ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు జరిగే మీడియా సమావేశంలో వెల్లడిస్తామని ట్రంప్ వెల్లడించారు. దీంతో అంతర్జాతీయంగా ఈ అంశంపై ఉత్కంఠ మరింత పెరిగింది.

శనివారం తెల్లవారుజామున వెనెజులా రాజధాని కారకాస్‌తో పాటు మిరాండా, అరాగ్వా, లా గైరా ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. చినూక్ హెలికాప్టర్లు, ప్రత్యేక దళాలతో అమెరికా సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అత్యంత కీలకమైన ‘డెల్టా ఫోర్స్’ యూనిట్ ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం.

గత కొన్ని నెలలుగా వెనెజులా తీరప్రాంతాల్లో అమెరికా తన సైనిక కార్యకలాపాలను పెంచిందని స్థానిక మీడియా గుర్తుచేసింది. మదురో పదవి నుంచి తప్పుకోవాలని వైట్‌హౌస్ తీవ్రంగా ఒత్తిడి చేస్తోందని, ఈ సైనిక దాడికి ట్రంప్ ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు కథనాలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *