Veng sarkar: సర్ఫరాజ్‌ను సెలెక్ట్ చేయకపోవడం సిగ్గుచేటు

Veng sarkar: టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్టర్లు పదేపదే పక్కన పెట్టడంపై భారత మాజీ కెప్టెన్‌, మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌కు మూడు ఫార్మాట్లలోనూ ఆడే సామర్థ్యం ఉందని, అలాంటి ప్రతిభావంతుడికి సరైన అవకాశాలు ఇవ్వకపోవడం నిజంగా సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్, గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 75 బంతుల్లోనే 157 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అవకాశం దక్కినప్పుడు సర్ఫరాజ్ చక్కటి ఆట చూపాడని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.

అన్ని ఫార్మాట్లకు తగినట్లు తన ఆటను మార్చుకునే సత్తా సర్ఫరాజ్‌కు ఉందని, అయినా అతడిని నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదని వెంగ్‌సర్కార్ విమర్శించారు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఆటగాడికి అంతర్జాతీయ స్థాయిలో సరైన అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత సెలక్టర్లదేనని స్పష్టం చేశారు.

సర్ఫరాజ్ ఖాన్‌కు వరుసగా అవకాశాలు రాకపోవడంపై ఇప్పటికే క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తుండగా, వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *