Vellore: కొంతమంది పురాతన నిధుల కోసం అడవుల్లో తిరుగుతూ ఉంటారు. పురాతనమైన ఆలయాలు, గోపురాలు లక్ష్యంగా చేసుకుని నిధుల కోసం వెతుకుతుంటారు. అలాంటి ఒక ముఠా నిధి కోసం వెతుకుతూ వేయి సంవత్సరాల పురాతనమైన గోడను కూల్చివేశారు.
వెల్లూరు సమీపంలోని జరిగిన ఈ ఘటనలో 1,000 సంవత్సరాల పురాతన ఆలయ గోడను కూల్చివేసి నిధి కోసం వెతికిన ముఠాపై ఫిర్యాదు నమోదైంది. వెల్లూరు జిల్లాలోని కైలాస పర్వతం ఉస్సూర్ పక్కన ఉన్న శివనాథపురంలో అటవీ శాఖ నియంత్రణలో ఉంది. దీనికి తోడు 1,000 సంవత్సరాల పురాతనమైన కైలాసనాథర్ ఆలయం, ఆంజనేయర్ ఆలయం నిర్వహణ లేకుండా అక్కడ శిధిలావస్థలో మిగిలిపోయాయి.
ఇక్కడ నిధులు ఉన్నాయని వదంతులు చాలాకాలంగా వ్యాప్తిలో ఉన్నాయి.
ఈ విషయం తెలుసుకున్న 10 మంది బృందం అక్కడ మూడు రోజుల పాటు ‘టెంట్’ ఏర్పాటు చేసుకుని వంటలు చేసి తింటూ, ఆలయ నల్లరాతి గోడను కొన్ని చోట్ల పగలగొట్టి, నిధి కోసం ఆలయం చుట్టూ గుంట తవ్వారు.
ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు తమ గొర్రెలు, ఆవులను మేపడానికి పర్వతానికి వెళ్ళినప్పుడు, కూలిన గోడలను చూసి షాక్ అయ్యారు. వారంతా కలిసి అక్కడి ముఠాను గట్టిగా నిలదీసేసరికి ఆ ముఠా అక్కడి నుండి పారిపోయింది.
అటవీశాఖ అధికారులు అక్కడ మేకలు, ఆవుల కాపరులను నిత్యం ఆ ప్రాంతానికి రావద్దని చెబుతూ అక్కడ నుంచి తరిమేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రహస్య ముఠాను మూడు రోజులు ఎలా అనుమతించారనే విషయంపై ఇప్పుడు వివాదం తలెత్తింది. వెల్లూరు జిల్లా హిందూ ఫ్రంట్ నాయకుడు మహేష్ నిన్న అటవీ శాఖకు ఆ ముఠాను గుర్తించి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.