Vedma bojju:  ఆ జీవో రద్దు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Vedma bojju: ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవో నెంబర్ 49ను తిరిగి తీసుకువస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో రాకపోకలు నిలిపితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అధికారులను తరిమి తరిమి కొడతామని హెచ్చరికలు జారీ చేశారు. పోడు భూములపై మరియు అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలపై ఆంక్షలు వేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు మార్లు అటవీ శాఖ అధికారులను నచ్చజెప్పామని, అయినా వారు మారకపోతే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

గత పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని మాజీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందజేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ప్రతి అర్హుడికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక విషయంలో ఇబ్బందులు కలిగిస్తే తాము మౌనంగా ఉండబోమని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *