Vasamshetti Subash: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘రెడ్ బుక్’ అనే పేరు వినగానే కొడాలి నాని గజగజ వణికిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి, గతంలో జగన్‌ను మెప్పించేందుకే తమ పార్టీ నేతలపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అప్పట్లో నోటికి వచ్చినట్లు మాట్లాడిన నాని, ఇప్పుడు మాత్రం రెడ్ బుక్ పేరు చెప్పగానే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
మెడికల్ కాలేజీల అంశంపై ప్రభుత్వంఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుందని వాసంశెట్టి తెలిపారు. ఈ విషయంపై వైసీపీ నేతలు చేపడుతున్న సంతకాల సేకరణ పూర్తిగా నాటకమేనని ఆయన ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.
అదేవిధంగా, 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే ఎందుకు పరిమితమైంది అనే అంశంపై సంతకాల సేకరణ చేస్తే మంచిదని కొడాలి నానిని ఉద్దేశించి మంత్రి హితవు పలికారు. ప్రజలు ఇప్పటికే తమ తీర్పు చెప్పేశారని స్పష్టం చేశారు
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖపట్నాన్ని గంజాయి హబ్‌గా మార్చేశారని వాసంశెట్టి సుభాష్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ పూర్తిగా క్షీణించిందని, ప్రస్తుతం ప్రభుత్వం ఆ పరిస్థితిని సరిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

