Varma: వైసీపీ అధినేత జగన్ యూరియా కొరత పేరుతో రాద్ధాంతం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా విమర్శించారు. రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని, వాస్తవాలను తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదని ఆయన సూచించారు.
కాకినాడ జిల్లాకు 23,359 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే, ఇప్పటికే 19,385 మెట్రిక్ టన్నులు సొసైటీల ద్వారా పంపిణీ చేశామని గణాంకాలను వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు యూరియా అమ్మి రైతులను దోచుకున్నారని వర్మ ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎమ్మార్పీ రేటుకే యూరియా అందుతుంటే, ఆ వాస్తవం జగన్‌కు కనిపించకపోవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు.
2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందించడంలో విఫలమైందని వర్మ దుయ్యబట్టారు. అలాగే, గతంలో ధాన్యం అమ్మిన రైతులకు ఏడాది గడిచినా డబ్బులు రాకపోవడం సాధారణమైపోయిందని గుర్తుచేశారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ అన్నదాతల పక్షపాతిగా నిరూపించుకున్నారని వర్మ ప్రశంసించారు.