Varma: పిఠాపురంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు చేశారు.
వర్మ మాట్లాడుతూ, “ఒక రైతు తట్టెడు మట్టిని తన పొలంలో తవ్వుకున్నా, ఆయనను నాలుగు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచుతున్నారు. అదే సమయంలో రోజుకు 200 లారీలు ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే అధికారులు ఎందుకు కళ్లు మూసుకుంటున్నారు?” అంటూ ప్రశ్నించారు.
ఇప్పటికే ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హెచ్చరించినట్లు ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం నశిస్తుందని స్పష్టం చేశారు.
ఇసుక మాఫియాపై అధికారులు పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ హస్తం ఉందని వర్మ ఎద్దేవా చేశారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన వారు అబద్ధపు కేసుల పెట్టే పనిలో పడ్డారని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు.