Vangaveeti Ranga: దివంగత కాపు నేత, మాస్ లీడర్‌గా చెరగని ముద్ర వేసిన వంగవీటి మోహన రంగా వారసత్వం మరోసారి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతుండగా, తాజాగా ఆయన సోదరి వంగవీటి ఆశా కిరణ్ (Asha Kiran) పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు.
ఆదివారం విజయవాడ బందరు రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆశా కిరణ్ మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు ప్రజా జీవితంలోకి రావడం విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రజలతోనే నా ప్రయాణం: ఆశా కిరణ్ హామీ
గత కొంతకాలంగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్న తాను, ఇకపై తన పూర్తి ప్రయాణం ప్రజలతోనే ఉంటుందని ఆశా కిరణ్ స్పష్టం చేశారు. ఇక మీదట తాను దివంగత వంగవీటి రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని ప్రకటించారు. విజయవాడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, తాను వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రంగా, రాధా… కులం, ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా సాయం కోరి వచ్చిన వారందరిని ఆదుకున్నారని గుర్తుచేస్తూ, తాను కూడా వారి మార్గంలోనే నడుస్తానని తెలిపారు.
ఇది కూడా చదవండి: Black Coffee: మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. బెనిఫిట్స్ తో పాటు నష్టాలు కూడా ఉన్నాయి
రాధా-మిత్రా మండలి గ్యాప్‌ను పూరించడానికే!
రాజకీయాల్లోకి రావడానికి గల ముఖ్య కారణాన్ని ఆశా కిరణ్ వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ, రంగా మిత్రా మండలిల మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. ఆ ఖాళీని పూర్తి చేయడానికే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను.అంటూ తన రాజకీయ ప్రవేశ ఉద్దేశాన్ని వెల్లడించారు.
అన్న రాధా సలహాతోనే.. పార్టీపై ఇంకా నిర్ణయం లేదు
వంగవీటి రాధాకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తమ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఆశా కిరణ్ స్పష్టం చేశారు.”నేను నా సోదరుడు వంగవీటి రాధాకృష్ణ సలహాలు, సూచనలతోనే రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తాను” అని ఆమె వెల్లడించారు.అయితే, ఏ పార్టీలోకి వెళ్లాలి అనే దానిపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆశా కిరణ్ తెలిపారు. ఆమె రాకతో వంగవీటి కుటుంబ అభిమానులు, మిత్ర మండలిల్లో కొత్త ఉత్సాహం నిండింది.
