Vanajeevi Ramaiah:పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం సమాజానికి తీరనిలోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప ప్రకటనలను విడుదల చేశారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య గుండెపోటుతో చికిత్స పొందుతూ ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కన్నుమూశారు.
రామయ్య మార్గం యువతకు ఆదర్శం: సీఎం రేవంత్‌రెడ్డి
Vanajeevi Ramaiah:ప్రకృతి లేనిదే మానవ మనుగడ లేదని బలంగా నమ్మిన వ్యక్తి రామయ్య అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. రామయ్య మృతి సమాజానికి తీరనిలోటని పేర్కొన్నారు. వనజీవి రామయ్య సేవలు, ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శప్రాయమని చెప్పారు. నేటి యువత ఆయన ఆదర్శాలను కొంతైనా పాటించి, పర్యావరణానికి పాటుపడాలని కోరారు.
ప్రపంచమే పర్యావరణవేత్తను కోల్పోయింది: కేసీఆర్
Vanajeevi Ramaiah:వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరనిలోటని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ, ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా పద్మశ్రీ రామయ్య బతికారని కొనియాడారు. ఆయన మరణంపై కేసీఆర్ విచారం వ్యక్తంచేస్తూ సంతాపం ప్రకటించారు. వృక్షోరక్షతి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకొని, కోటికిపైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని గుర్తుచేశారు. మొక్కల పెంపకంతో వనజీవిగా మారిన దరిపల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన త్యాగం అసమాన్యమైనదని పేర్కొన్నారు. గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రామయ్య చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.
వనజీవి రామయ్య జీవితం ధన్యం: ఈటల
Vanajeevi Ramaiah:కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య జీవితం ధన్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కొనియాడారు. రామయ్య జీవితం ఎంతో మందికి మర్గదర్శనమని పేర్కొన్నారు. ఆయన మరణం బాధాకరమని పేర్కొంటూ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. రామయ్యను ఆదర్శంగా తీసుకొని ప్రకృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న వింధ్వంసాన్ని ఐక్యంగా ఎదుర్కొందామని చెప్పారు.
