Vallabhaneni Vamsi:

Vallabhaneni Vamsi: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు.. విజ‌య‌వాడ‌కు త‌ర‌లింపు.. కేసులివే..

Vallabhaneni Vamsi: వైసీపీ గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న‌ను అరెస్టు చేసిన పోలీసులు విజ‌య‌వాడ‌కు తీసుకెళ్తున్నారు. గ‌న్న‌వ‌రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయ‌న అరెస్టుపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న‌ది. అదే కేసుపై అరెస్టు చేశారా? లేక మ‌రో కేసులో అరెస్టు చేశారా? అన్న విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

Vallabhaneni Vamsi: హైద‌రాబాద్ రాయ‌దుర్గంలోని మైహోం భుజాలో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీని ఇక్క‌డి రాయ‌దుర్గం పోలీసుల స‌హ‌కారంతో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం ఔట‌ర్ రింగ్ రోడ్డు మీదుగా ఆయ‌న‌ను విజ‌య‌వాడ హైవే నుంచి విజ‌య‌వాడ న‌గ‌రానికి త‌ర‌లిస్తున్నారు. ఆయ‌న అరెస్టు విష‌యంపై పోలీసులు స్ప‌ష్ట‌మైన విష‌యాలు తెలియ‌కున్నా, ప‌లు విష‌యాలు బ‌య‌ట‌కువ‌చ్చాయి.

Vallabhaneni Vamsi: 2023 ఫిబ్ర‌వ‌రి 20న గ‌న్న‌వ‌రంలో టీడీపీ కార్యాల‌యంపై దాడి జ‌రిగింది. ఈ కేసులో వంశీ స‌హా 88 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో త‌న‌ను అరెస్టు చేయ‌కుండా పోలీసుల‌ను ఆదేశించాలంటూ కోర్టు వంశీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై ఈ నెల 20న విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది. ఇంత‌లోనే పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Vallabhaneni Vamsi: టీడీపీ కార్యాల‌య కార్య‌ద‌ర్శి స‌త్య‌వ‌ర్ధ‌న్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా, ఉన్న‌ట్టుండి ఇటీవ‌లే స‌త్య‌వ‌ర్ద‌న్ త‌న కేసును వాప‌స్ తీసుకున్నాడు. దీంతో అనుమానంతో స‌త్య‌వ‌ర్ద‌న్‌ను అదుపులోకి తీసుకొని విచారించ‌గా, వంశీ అనుచ‌రులు బెదిరించిన‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు ఆయ‌న‌తోపాటు, ఆయ‌న అనుచ‌రుల‌పై కేసు న‌మోదైన‌ట్టు స‌మాచారం.

Vallabhaneni Vamsi: వల్ల‌భ‌నేని వంశీపై విజ‌య‌వాడ ప‌డ‌మ‌ట పోలీసులు బీఎన్ఎస్ సెక్ష‌న్ 140(1), 308, 351(3), రెడ్‌విత్ 3(5), ఎస్సీ-ఎస్టీ కేసులు పెట్టిన‌ట్టు స‌మాచారం. వంశీ అరెస్టు స‌మ‌యంలో ట్విస్ట్ నెల‌కొన్న‌ట్టు తెలిసింది. రాయ‌దుర్గంలోని మైహోం భుజాలోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఉండ‌గా, త‌న‌ను అరెస్టు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. దీంతో డ్రెస్ చేంజ్ చేసుకొని వ‌స్తాన‌ని లోప‌లికి వెళ్లిన వంశీ.. కొంద‌రు మీడియా ప్ర‌తినిధుల‌కు, వైసీపీ నేత‌ల‌కు స‌మాచారం ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *