Vallabhaneni Vamsi: అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ.. ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో జైలులో హడావుడి నెలకొంది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్న వంశీ, ఈ విషయాన్ని జైలు సిబ్బందికి తెలియజేయగా… వారు ఆలస్యం చేయకుండా అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వంశీకి అక్కడ వైద్యం అందిస్తున్నారు.
వంశీ ఆరోగ్య పరిస్థితి ఆస్పత్రిలోకి చేరిన విషయం బయటికి తెలియడంతో వైసీపీ నాయకులు, ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, వంశీపై వరుస కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆయన జైలులోనే ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు, ఆత్కూరు భూమి అక్రమ ఆక్రమణ కేసులోనూ వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఆయనకు ఇప్పటికే బెయిల్ మంజూరు అయినప్పటికీ, మిగిలిన కేసుల కారణంగా ఆయన విడుదల కాలేకపోతున్నారు.
ఇంతలో మరో కేసులో – మల్లవల్లి పరిసరాల్లో భూములకు సంబంధించి పరిహారం అన్యాయంగా తన అనుచరులకు ఇప్పించాడని ఆరోపణలపై హనుమాన్ జంక్షన్ పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా, నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ, ఇతర కేసుల కారణంగా వంశీ జైలు జీవితాన్ని కొనసాగిస్తున్నారు.