Vakiti srihari: ఖేలో ఇండియా ఎనిమిదవ ఎడిషన్‌ను తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కేంద్రాన్ని కోరారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారని, తాను కూడా క్రీడల శాఖ మంత్రిగా తెలంగాణలో ఉన్న క్రీడా సదుపాయాలను వివరించి, వచ్చే సంవత్సరం ఖేలో ఇండియా క్రీడలను రాష్ట్రంలో నిర్వహించాలంటూ అభ్యర్థించానన్నారు.
హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్, వనపర్తి వంటి జిల్లాల్లోని క్రీడా పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కొత్త స్టేడియాల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు.
టెలంగాణ స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి మాట్లాడుతూ వనపర్తి హాకీ అకాడమీలో మౌలిక వసతులు, క్రీడా పాఠశాలల్లో టర్ఫ్ ఏర్పాటుకు, పలు జిల్లాల్లో పరికరాల కోసం నిధులు కోరామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఏర్పడుతున్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా కేంద్ర సహకారం కోరామని వెల్లడించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ. జితేందర్ రెడ్డి, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డా. గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.

