Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఐపీఎల్​లో స్పెషల్ అట్రాక్షన్​గా వైభవ్.. మీకు తెలియని విషయాలివే..

Vaibhav Suryavanshi: ఐపీఎల్ అంటేనే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే వేదిక. ఐపీఎల్​తో ఇప్పటికే ఎంతో మంది యంగ్ క్రికెటర్లు స్టార్లుగా ఎదిగారు. ఈ సారి కూడా ఓ యువ సంచలనం స్టేడియాన్ని ఉర్రూతలూగించింది. 14 ఏళ్ల పిల్లోడు మైదానంలో మంటలు పుట్టించాడు. సెంచరీ, హాఫ్ సెంచరీలతో వరల్డ్ టాప్ బౌలర్లను ఊచకోత కోసి ఔరా అనిపించాడు. చిన్నపిల్లాడు అనుకుంటే చిచ్చరపిడుగులా అదరగొట్టాడు. ఇలా ఈ ఐపీఎల్ సీజన్​కే వైభవ్ సూర్యవంశీ స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచాడు. ఈ సీజన్​లో తన చివరి మ్యాచ్​లోనూ హాఫ్​ సెంచరీతో తన టీమ్​కు గెలుపునందించాడు.

ఐపీఎల్​లో 2025లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఘన విజయం సాధించినప్పటికీ.. అతితక్కువ పాయింట్లతో ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్​లో 14 ఏళ్ల పిల్లాడు వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌‌తో రాణించాడు. ప్రతిసారి దూకుడుగా ఆడే వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో మాత్రం నిలకడగా ఆడి తనలోని క్లాస్‌ని కూడా చూయించాడు. సింగిల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సంజూ శాంసన్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. దీంతో ఆర్ఆర్ తన చివర్​ మ్యాచ్​ను గెలుపుతో ముగించింది.

కాగా వైభ‌వ్ ఐపీఎల్ ప్రారంభమైన మూడేళ్లకు అంటే 2011లో బీహార్‌లోని తాజ్‌పుర్ గ్రామంలో జ‌న్మించాడు. క్రికెట్‌నే శ్వాస‌గా భావించిన అత‌డు 12 ఏళ్ల‌కే రంజీల్లో అడుగుపెట్టాడు. దాంతో రంజీల్లో తొలి మ్యాచ్ ఆడిన నాలుగో చిన్న వ‌య‌స్కుడిగా రికార్డు నెల‌కొల్పాడు. వైభ‌వ్12 ఏండ్ల 284 రోజుల వ‌య‌సులో పాట్నా జ‌ట్టు త‌ర‌ఫున బ‌రిలోకి దిగాడు.

Also Read: IPL 2025: ఐపీఎల్‌ మ్యాచ్‌ వేదికల్లో మార్పు! ఫైనల్‌ అక్కడే.. RCB ఫ్యాన్స్‌కు పండగే!

అతడు రంజీలకు ఎంపికవ్వ‌డంలో అత‌డి తండ్రి సంజీవ్ సూర్య‌వంశీ కీలక పాత్ర పోషించాడు. ఐదేండ్ల వ‌య‌సులోనే వైభ‌వ్ ప్ర‌తిభ‌ను గుర్తించి ప్రోత్స‌హించి శిక్ష‌ణ ఇప్పించాడు. మొద‌ట్లో స‌మ‌స్తిపూర్‌లో.. ఆ త‌ర్వాత ప‌ట్నాలోని అకాడ‌మీలో కొడుకును చేర్పించాడు. ప‌ట్నాలో రాటుదేలిన వైభ‌వ్ ఈ మ‌ధ్యే కూచ్ బెహ‌ర్ ట్రోఫీలో బిహార్ త‌ర‌ఫున స‌త్తా చాటాడు.

అలా ఐపీఎల్​ ఫ్రాంచైజీలను ఆకర్షించిన వైభవ్.. 13 ఏళ్ల వయసులోనే అతడు వేలంలోకి వచ్చిన సంచలనానికి తెరదీశాడు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో లాంటి ప్లేయర్లే అన్‌సోల్డ్‌గా మిగిలిన ఈ వేలంలో సూర్యవంశీకి భారీ డిమాండ్ దక్కింది. అతడి కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని రాజస్థాన్ రాయల్స్‌ రూ. 1.10 కోట్లకు సొంతం చేసుకుంది. ఆర్ఆర్ జట్టు నమ్మకాన్ని నిలబెడుతూ వైభవ్ ఐపీఎల్లో దుమ్మురేపాడు. గుజరాత్​పై 35 బంతుల్లోనే 100 రన్స్​తో ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

రికార్డులే కాదు అటు పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వడంలోనూ వైభవ్ ముందున్నాడు. చెన్నైతే మ్యాచ్ ముగిశాక ధోనీ పాదాలను తాకి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్​లో అత్యంత ఎక్కువ వయస్సున్న ప్లేయర్​గా ధోనీ ఉంటే.. అతితక్కువ వయస్సు ఉన్న ప్లేయర్​గా వైభవ్​ నిలవడం గమనార్హం. ఏదిఏమైన రానున్నకాలంలో వైభవ్ టీమిండియా తరఫున ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం ఖాయమని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *