Uttar pradesh: నవవధువా? మజాకా! వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆషామాషీగా చూశారని అలగలేదు. ఆగ్రహం చెందింది. వారి చిన్నచూపుతో తన భావి జీవితాన్నే అవగతం చేసుకున్నది. వరుడి ఆగ్రహావేశాలు చూసి అవాక్కవలేదు.. ఆవేదనా చెందలేదు.. ఈ చిన్నచూపు, వరుడి కోపం రేపు తన నిండు జీవితంలోనూ కొనసాగుతుందేమోనని అనుమానం చెందింది. తనకేమి సుఖం దక్కుతుందని భావించింది. అనుకున్నదే తడవుగా ఇక ఆ వరుడి కుటుంబం తనకు తగదని నిర్ధారించుకున్నది. ఆ వరుడే సరికాదని నిర్ణయించుకున్నది. ఏకంగా తన వివాహాన్నే క్యాన్సిల్ చేసేసుకున్నది. ఎవరు చెప్పినా వినకుండా తన పంతాన్నే నెగ్గించుకున్నది.
Uttar pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగిన ఈ షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. వివాహం సందర్భంగా వరుడి కుటుంబం వధువు కోసం ఓ గదిని బుక్ చేసింది. అయితే వధువు కోసం బుక్ చేసిన ఆ గదిలో ఏసీ లేదని, వేడితో భరించలేని ఉక్కపోతగా ఉన్నదని వధువు తెలిపింది. ఆ గదిని రద్దు చేసి పక్కనే ఉన్న ఏసీ గదిని బుక్ చేయాలని వరుడి కుటుంబాన్ని ఆ వధువు కుటుంబం కోరింది.
Uttar pradesh: వధువు కుటుంబం కోరికను వరుడి కుటుంబం నిరాకరించింది. వధువు కోరిక మేరకు ఏసీ గదిని బుక్ చేసేందుకు ముందుకు రాలేదు. ససేమిరా అని అభ్యంతరం తెలిపింది. దీంతో వధూవరుల ఇరు కుటుంబాలు వాగ్వాదానికి దిగారు. ఇది చినికి చినికి గాలివానలా మారి ఇరువర్గాల పంచాయతీ తీవ్రరూపం దాల్చింది. ఈ సమయంలో వరుడు తీవ్ర ఆగ్రహానికి లోనై ఊగిపోతూ వధువు, ఆమె కుటుంబంపై నోరు పారేసుకున్నాడు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యాడు.
Uttar pradesh: వరుడి ఆగ్రహావేశాలను కళ్లారా చూసి వధువు సహించలేకపోయింది. కనీస సదుపాయం కల్పించలేకపోయారు.. తనకు కాబోయే భర్త కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని ప్రదర్శించాడు.. ఇది భావి జీవితంలోనూ కొనసాగితే తన బతుకు వ్యర్థమని ఆ వధువు భావించింది. వెంటనే ఆ నవ వధువు పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు తేల్చి చెప్పేసింది. అతడిని వివాహమాడేది లేదంటూ తెగేసి చెప్పి పెళ్లి వేదికపై నుంచి కిందికి దిగి వెళ్లిపోయింది.
Uttar pradesh: మరికొద్ది క్షణాల్లో ఇరువురూ ఒక్కటైతే ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులందరూ అవాక్కయ్యారు. ఈ పెళ్లి గోల పెద్దది కావడంతో సమాచారం పోలీసుల దాకా చేరింది. దీంతో వారూ రంగప్రవేశం చేశారు. పెండ్లి పెద్దలు, పోలీసులూ వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏకంగా వరుడిపైనే ఆ వధువు ఆగ్రహం వ్యక్తంచేసింది. కనీస అవసరాలు తీర్చలేని, మర్యాదగా వ్యవహరించలేని వాడితో జీవితం నరకంగా మారుతుందని పోలీసులకు చెప్పింది. అతడిని పెళ్లి చేసుకోలేనని సున్నితంగా తేల్చి చెప్పింది.
Uttar pradesh: ఆ ఇద్దరిని కలపాలనే ఆఖరి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో వధువు కుటుంబం వరుడి కుటుంబం పెట్టిన పెళ్లి ఖర్చులు తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నది. ఆ తర్వాత చెల్లింపులు కూడా పూర్తవడంతో ఎవరిండ్లకు వారు వెళ్లిపోయారు. ఈ తతంగాన్ని అక్కడి స్థానిక మీడియాకు చెప్పడంతో అది కాస్తా వార్తగా మారింది. వరుడు ఇష్టారీతిన నోరుపారేసుకోవడంతోనే సర్దుకోలేకపోయామని వధువు కుటుంబం చెప్పింది.
