Uttam Kumar Reddy:నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. అన్నట్టు రాష్ట్రంలోని కొందరి మంత్రుల పరిస్థితి ఉన్నదని రాజకీయ విశ్లేషకులే కాదు.. సొంత పార్టీ నేతలే అంటున్నారు. మునుపెన్నడూ లేనంతగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు మంత్రులు హెలికాప్టర్‌ను వాడుతూ ప్రజాసొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మీడియాలో ఎంతో మంది అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నా, సొంత పార్టీ నేతలే కాదు.. ఏకంగా తోటి మంత్రుల నుంచే ఆ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా మార్పు ఇసుమంతగా కూడా రావడం లేదు. సోషల్ మీడియాలో కొందరు ఒకడుగు ముందుకేసి అది హెలికాప్టరా? పల్లె వెలుగు బస్సా? అంటూ చురకలు అంటించడం గమనార్హం.
Uttam Kumar Reddy:ముఖ్యంగా హెలికాప్టర్ వాడకంలో హద్దు పద్దు ఉండటం లేదని ఎందరో అంటున్నారు. గత నెలలో రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు కూడా అక్కడక్కడే హెలికాప్టర్లోనే ప్రయాణిస్తూ సుడిగాలి పర్యటన చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయినా తగ్గేదేలే అంటూ మళ్లీ ఈ నెల (ఏప్రిల్ 22) మరోసారి కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పర్యటన కోసం హెలికాప్టర్లో వెళ్లేందుకు మళ్లీ సిద్ధమయ్యారు.
Uttam Kumar Reddy:ఇటీవల రాష్ట్రంలోని మరో కీలక మంత్రి అయిన దామోదర రాజనర్సింహ హెలికాప్టర్ వాడకంపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంల నల్లగొండ, ఖమ్మం మంత్రుల రాజ్యం నడుస్తున్నది. హెలికాప్టర్ ఎక్కాలన్నా వాళ్లే.. వాటిని కొనాలన్నా వాళ్లే.. అని ఎద్దేవా చేశారు. ఆ మంత్రులు హైదరాబాద్ రావడానికి సెక్రటేరియట్‌పై ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలి. రాబోయే రోజుల్లో నాలుగు దిక్కుల కోసం నాలుగు హెలికాప్టర్లు కొనాలి.. అందరికంటే హెలికాప్టర్‌ను తక్కువ వాడింది తానేనని చిట్‌చాట్‌లో పై విషయాలను మంత్రి దామోదర రాజనర్సింహ పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Uttam Kumar Reddy:ఇదే మంత్రివర్గంలో మరో మంత్రి హెలికాప్టర్ వాడకంపై మరో విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు కూడా నర్మగర్భంగా మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ వాడకంపై అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ఉత్తమ్ ఒక్కడే హెలికాప్టర్లో పోతడా, నాకేం త క్కువ, నేను కూడా హెలికాప్టర్లోనే పోతా అని మొండికేశారని మీడియాలో ప్రచారమైంది.
Uttam Kumar Reddy:అసలు విషయం ఏమిటంటే.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియోజకవర్గమైన నల్లగొండ పట్టణం హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల లోపే ఉంటుంది. హైటెక్ కార్లలో వెళ్తే గంటకు అటూ ఇటుగానే చేరుకోవచ్చు. అదే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్ 170 కిలోమీర్ల వరకు ఉంటుంది. అంటే మరో అర్ధగంటకు పైగా కార్లలో వెళ్లొచ్చన్నమాట. గంట, గంటన్నర సేపు కార్లలో ఉండి వెళ్లే ఓపిక లేని మంత్రులు ఈ హెలికాప్టర్‌ను అదనపు ఖర్చులు పెట్టి సొంత నియోజకవర్గాలను చుట్టేసి వస్తున్నారు.
Uttam Kumar Reddy:మరి వారి కాన్వాయ్ హైదరాబాద్‌లో ఉంటుందా? అంటే అదీ లేదు. నియోజకవర్గాలకు ఖర్చుతో వెళ్లి రావాల్సిందే. అంటే ఇటు హెలికాప్టర్ ఖర్చు, కాన్వాయ్ ఖర్చు ప్రభుత్వానికి భారమేనన్నమాట. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం అవుతుందని ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాల నేతలు, సొంత పార్టీ నేతలతోపాటు ఏకంగా తోటి మంత్రులే తమ అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నా, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు హెలికాప్టర్లోనే వెళ్లొచ్చేందుకు సిద్ధమయ్యారు.
Uttam Kumar Reddy:ఈ నెల 22న (ఏప్రిల్) కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్‌ను కూడా ఖరారు చేశారు. అక్కడ జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలకు కూడా కొద్దిదూరంలో ఉన్న ప్రాంతాలకూ హెలికాప్టర్లోనే వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసి ఉంచడం గమనార్హం. మరి ఈ దుబారా ఖర్చులు ఇక ఎప్పటికి తగ్గుతయె, ఎవరు అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాలి మరి.