Uttam Kumar Reddy: తెలంగాణ పౌర సరఫరాల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి బిఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వరి సేకరణ విషయంలో బీఆర్‌ఎస్ దుష్ప్రచారాన్ని ఆపాలని ఆయన హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వరి కొనుగోలు భారీ స్థాయిలో జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
“ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 43.10 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరించాం. ఇదే గత ఏడాది కాలంలో 29.88 ఎల్పీఎంటీల మాత్రమే సేకరించాం. రెండు సంవత్సరాల కిందట అయితే ఇది కేవలం 19.62 ఎల్పీఎంటీలే. అంటే ఈసారి 44 శాతం పెరుగుదల, గత రెండు సంవత్సరాలతో పోలిస్తే 120 శాతం పెరుగుదల నమోదైంది,” అని మంత్రి తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: హైదరాబాద్ కు 2,800 ఎలక్ట్రిక్ బస్సులు
రైతుల భద్రత కోసం ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. నూతనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, వ్యవస్థను క్రమబద్ధీకరించడం, కనీస మద్దతు ధరకు తోడు నాణ్యమైన వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించడంతో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు.
తెలంగాణలో వరి ఉత్పత్తి చరిత్రలోనే ఎన్నడూ లేని రీతిలో పెరిగిందని ఆయన గర్వంగా తెలిపారు. వనకాలం సీజన్‌లో 66.7 లక్షల ఎకరాల్లో 153.5 ఎల్పీఎంటీలు, యాసంగిలో 55 లక్షల ఎకరాల్లో 127 ఎల్పీఎంటీల దిగుబడి వచ్చిందని చెప్పారు. మొత్తం 280 ఎల్పీఎంటీల వరి ఉత్పత్తి రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ఒక రికార్డు స్థాయికి తీసుకెళ్లిందని వివరించారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యమైనా, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని దృఢంగా మద్దతు ఇచ్చింది. ఇది రాష్ట్ర రైతులకు ఇచ్చిన మాటకు నిలబడిన నిదర్శనం,” అంటూ మంత్రి ఉత్తమ్ ఘాటుగా పేర్కొన్నారు.