Uttam Kumar Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్‌పై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా, సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఆదివారం సెక్రటేరియెట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలను గణాంకాలతో సహా వివరించారు.
అబద్ధాల కేరాఫ్ అడ్రస్ కేసీఆర్!
కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని ఉత్తమ్ కొట్టిపారేశారు. “రీడిజైనింగ్” పేరుతో రూ. 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా, కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ప్రస్తుత ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు.
కృష్ణా జలాల విషయంలో ‘చీకటి ఒప్పందాలు’
కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెట్టారని మంత్రి ఆరోపించారు:
-
జగన్‌తో కుమ్మక్కు: ఏపీ మాజీ సీఎం జగన్‌తో కలిసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కేసీఆర్ పరోక్షంగా సహకరించారని, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌ను వాయిదా వేయించి ఏపీకి టెండర్లకు అవకాశం ఇచ్చారని విమర్శించారు.
-
నీటి వాటాలో ద్రోహం: కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు అని రాతపూర్వకంగా ఒప్పుకుని తెలంగాణ రైతుల గొంతు కోశారని దుయ్యబట్టారు.
-
పెరిగిన అక్రమ తరలింపు: 2014కు ముందు ఏపీ రోజుకు 47 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తే, కేసీఆర్ హయాంలో అది 1,11,400 క్యూసెక్కులకు పెరిగిందని గణాంకాలు బయటపెట్టారు.
కాంగ్రెస్ హయాంలోనే రికార్డు స్థాయి దిగుబడి
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ హయాంలోనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా పాలమూరు, నల్గొండ జిల్లాల్లో రైతులు అద్భుతమైన దిగుబడి సాధించారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Egg Price Hike: కోడిగుడ్డు రేట్.. ఆల్ టై రికార్డ్ బ్రేక్
మేము అధికారంలోకి వచ్చాకే రాయలసీమ లిఫ్ట్ పనులను అడ్డుకున్నాం. క్యాచ్‌మెంట్ ఏరియా ప్రకారం తెలంగాణకు 500 టీఎంసీలకు పైగా వాటా రావాలని సుప్రీంకోర్టులోనూ, ట్రిబ్యునల్స్‌లోనూ గట్టిగా పోరాడుతున్నాం. – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కీలక ప్రశ్నలు.. సూటి విమర్శలు
ప్రాణహిత-చేవెళ్ల: పది వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారు? ఇప్పుడు రంగారెడ్డి జిల్లాపై ప్రేమ ఒలకబోయడం విడ్డూరం కాదా?
పోలవరం-నల్లమలసాగర్: ఈ ప్రాజెక్టులపై రిట్ పిటిషన్ వేసి కేంద్రంతో పోరాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
పదేళ్ల పాటు ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని వృథా చేసిన బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.
