Uttam Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను తిరస్కరించిందని, ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను వినియోగించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలనుకున్నప్పటికీ, అంతర్-రాష్ట్ర జల నిబంధనలను ఉల్లంఘించి పనులు చేపట్టిందని మంత్రి విమర్శించారు. ఈ విషయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహల్ బొజ్జా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని మంత్రి గుర్తు చేశారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRBM), అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. అంతేకాకుండా, పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ ప్రాజెక్టును ప్రారంభించారని స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కీలక సమయంలోనే కృష్ణా జలాల్లో తమ హక్కును కాపాడేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రితో వ్యక్తిగతంగా చర్చించి, ఈ అంశంపై సమగ్ర వివరణ ఇచ్చినట్లు తెలిపారు.
ఫిబ్రవరి 27న జరిగిన 25వ సమావేశంలో, జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) ఉత్తర్వులను సమీక్షించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణ హక్కులను కాపాడుతూ, కృష్ణా జలాల విషయంలో విధానపరమైన పోరాటం కొనసాగిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

