USA

USA: ట్రంప్ కీలక నిర్ణయం.. 75 దేశాలకి నో “వీసా”

USA: అగ్రరాజ్యం అమెరికా వలసదారుల విషయంలో అత్యంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటూ ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది. అక్రమ వలసలను అడ్డుకోవడమే లక్ష్యంగా సుమారు 75 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించింది. జనవరి 21 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుండి వచ్చే దరఖాస్తుదారులకు వీసా ప్రాసెసింగ్ నిలిచిపోనుంది. అమెరికా ప్రయోజనాలకే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, కొత్తగా వచ్చే వారు అమెరికన్ల సంపదపై ఆధారపడకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ముఖ్యంగా అమెరికాలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయంపై ఆధారపడే అవకాశం ఉన్నవారిని నియంత్రించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. “పబ్లిక్ ఛార్జ్” అనే నిబంధనను తెరపైకి తెస్తూ, భవిష్యత్తులో ప్రభుత్వానికి భారంగా మారతారని భావించే వారికి వీసాలు తిరస్కరించాలని దౌత్య అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగా దరఖాస్తుదారుల వయస్సు, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు, ఇంగ్లీష్ భాషపై ఉన్న పట్టును కూడా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అధిక బరువు ఉన్నవారు లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారు అమెరికా వైద్య వనరులను ఎక్కువగా ఉపయోగిస్తారనే కారణంతో వారికి వీసాలు నిరాకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: IND vs NZ: కేఎల్ రాహుల్ సెంచరీ వృథా.. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి!

ఈ 75 దేశాల జాబితాలో సోమాలియాపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో మిన్నెసోటాలో జరిగిన ఒక భారీ ఆర్థిక కుంభకోణం, పన్ను చెల్లింపుదారుల నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావడంతో ఆ దేశ పౌరులపై నిఘా పెంచారు. అమెరికా ప్రభుత్వం తన వీసా స్క్రీనింగ్, విచారణ (వెట్టింగ్) పద్ధతులను పూర్తిగా సమీక్షించి, కొత్త భద్రతా ప్రమాణాలను ఖరారు చేసే వరకు ఈ నిషేధం కొనసాగనుంది. వలస చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా అమెరికా పౌరుల ఆర్థిక భద్రతను కాపాడటమే ఈ సంచలన నిర్ణయం యొక్క అంతిమ లక్ష్యమని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *