US Tariffs Effect: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై అదనంగా 25 శాతం సుంకాలను విధించారు. ఈ కొత్త నిబంధనలు నేటి నుంచే అమల్లోకి వస్తున్నాయి. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రత్నాభరణాలు, రాగి ఉత్పత్తులు, దుస్తులు, బియ్యం వంటి రంగాలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది.
రత్నాభరణాల రంగంపై తీవ్ర ప్రభావం:
అమెరికా విధించిన ఈ కొత్త సుంకాల వల్ల రత్నాభరణాల రంగంలో లక్ష మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి (AIGJDC) ఛైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. గతంలో అమెరికా 10 శాతం సుంకం విధించినప్పుడు 50,000 మంది ఉపాధి కోల్పోయారని గుర్తుచేశారు. చేతితో తయారు చేసే ఆభరణాల ధరలు పెరిగి, అమెరికా మార్కెట్లో వాటికి గిరాకీ తగ్గే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఐరోపా సమాఖ్య, పశ్చిమాసియా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు దృష్టి సారించాలని రోక్డే సూచించారు.
పాక్షిక రాగి, రాగి ఆధారిత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం అదనపు సుంకాన్ని విధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 360 మిలియన్ డాలర్ల విలువైన రాగి ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. ఈ కొత్త సుంకాలతో రాగి ఉత్పత్తుల ఉత్పత్తి తగ్గి, ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికి విరుద్ధంగా, అమెరికా నుంచి భారత్‌లోకి దిగుమతి అయ్యే రాగి ఉత్పత్తులపై మనదేశం కేవలం 2.5 శాతం నుంచి 10 శాతం వరకు మాత్రమే సుంకం విధిస్తోంది.
ఇక దుస్తుల విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 12 శాతం సుంకంపై అదనంగా 25 శాతం విధించడంతో దుస్తుల ఎగుమతులు తగ్గవచ్చని అంచనా. అమెరికాకు భారత్ నుంచి వెళ్లే రెడీమేడ్ దుస్తుల వాటా 33 శాతం కావడం గమనార్హం. మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు ఈ పరిస్థితి కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2024లో అమెరికా దిగుమతి చేసుకునే దుస్తుల్లో భారత్ వాటా 5.8 శాతానికి చేరగా, చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌లకు కలిపి 49 శాతం వాటా ఉంది.
భారత బియ్యం ఎగుమతులపై ఈ టారిఫ్‌లు తాత్కాలిక అడ్డంకిగా మారవచ్చు. అయితే, బియ్యం ధర-నాణ్యత విషయంలో వియత్నాం, పాకిస్థాన్ వంటి పోటీ దేశాల కంటే భారత్ మెరుగైన స్థానంలో ఉందని బియ్యం ఎగుమతిదార్ల సమాఖ్య (IREF) జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గార్గ్ పేర్కొన్నారు. అమెరికా భారత్‌కు అతిపెద్ద బాస్మతీ బియ్యం మార్కెట్ కాదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం 52.4 లక్షల టన్నుల బాస్మతీ బియ్యాన్ని ఎగుమతి చేయగా, అందులో అమెరికాకు చేరింది కేవలం 2.34 లక్షల టన్నులు మాత్రమే. భారత బియ్యంపై విధించిన 25 శాతం సుంకం చైనా (34%), వియత్నాం (46%), పాకిస్థాన్ (29%), థాయిలాండ్ (36%) వంటి పోటీదారుల సుంకంతో పోలిస్తే తక్కువేనని గార్గ్ వివరించారు.
ALso Read: Donald Trump: భారత్-రష్యా సంబంధాలపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు: ఆర్థిక యుద్ధ వాతావరణం!
అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఈ కొత్త టారిఫ్‌లను ప్రకటించారు. అయితే, నిజానికి భారత్‌తో అమెరికాకు వాణిజ్య లోటు ఉంది. దీనిని పూడ్చుకోవడానికే ఈ టారిఫ్‌లను విధించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా తన ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ఆరోపణలు చేస్తున్నా, వాస్తవ గణాంకాలు వేరేలా ఉన్నాయి. అమెరికా దిగుమతి చేసుకునే భారత ఉత్పత్తులపై సగటున 17 శాతం సుంకాన్ని వసూలు చేస్తుండగా, భారత్ అమెరికా ఉత్పత్తులపై సగటున కేవలం 3.3 శాతం సుంకాన్ని మాత్రమే విధిస్తోంది.
భారత ప్రభుత్వానికి చెందిన ప్రధాన చమురు శుద్ధి కంపెనీలైన బీపీసీఎల్ (BPCL), హెచ్‌పీసీఎల్ (HPCL), ఐఓసీఎల్ (IOCL), మరియు ఎంఆర్‌పీఎల్ (MRPL) గత వారం రోజులుగా రష్యా చమురును కొనుగోలు చేయలేదు అని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. రష్యాపై తాము ఆంక్షలు విధించినా, భారత్ చమురు కొనుగోలు ద్వారా ఆ దేశానికి సహకరిస్తోందని ట్రంప్ ఆరోపించారు. అందుకే పెనాల్టీ విధించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం, భారత ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు అబుదాబి మర్బన్ చమురు, పశ్చిమ ఆఫ్రికా చమురును కొంటున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, రష్యా రాస్ నెఫ్ట్ అనుబంధ నయారా ఎనర్జీ మాత్రమే రష్యా నుంచి భారీగా చమురు కొంటున్నాయి.
కొత్తగా విధించిన 25 శాతం టారిఫ్ వల్ల అమెరికాకు వస్తువులు ఎగుమతి చేసేవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమెరికా కొనుగోలుదారులు ఆర్డర్లను రద్దు చేసుకోవడం లేదా ప్రస్తుతానికి పక్కన పెట్టేయడం దీనికి కారణం. టారిఫ్‌కు అదనంగా పెనాల్టీ కూడా ప్రకటించినప్పటికీ, ఎంత అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇది తెలిసేంత వరకు అమెరికా కంపెనీలు వేచిచూడొచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఫియో) ఎస్.సి. రల్హాన్ పేర్కొన్నారు. టారిఫ్, పెనాల్టీపై వచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు.
