US Tariffs on India: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న కారణంతో అమెరికా భారత్‌పై అదనపు సుంకాలు విధించబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మంగళవారం (ఆగస్టు 27) నుంచి అమల్లోకి రానుంది. అగ్రరాజ్య కాలమానం ప్రకారం రాత్రి 12.01 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) ఈ కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ నోటీసు జారీ చేసింది.
మొత్తం 50% సుంకాలు
ఇప్పటికే భారత్ ఉత్పత్తులపై 25% టారిఫ్‌లు అమల్లో ఉన్నాయి. వాటికి అదనంగా మరో 25% పెంపు చేయడంతో, మొత్తంగా 50% సుంకాలు వర్తించనున్నాయి. దీంతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై నేరుగా ప్రభావం పడనుంది. ఎగుమతయ్యే కొద్ది వస్తువులకే మినహాయింపు ఇచ్చారు.
భారత్ తీవ్రంగా అభ్యంతరం
భారత ప్రభుత్వం ఈ నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది. అదనపు సుంకాలు అన్యాయం, అనుచితం, అహేతుకమని కేంద్రం స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: బీహార్‌లో రాహుల్ గాంధీ ని కలవనున్న రేవంత్ రెడ్డి
మోదీ భరోసా
ఈ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని చెప్పారు. అమెరికా ఆర్థిక ఒత్తిడి ఎంత పెరిగినా, భారత్ దాన్ని తట్టుకుని ముందుకు సాగుతుందని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. “ఆత్మనిర్భర భారత్ దిశగా మేము గట్టి అడుగులు వేస్తున్నాం. రెండు దశాబ్దాల కృషి ఈ మార్గంలో వెనుక ఉంది. ఎంత కఠిన పరిస్థితులైనా వాటిని ఎదుర్కొనే శక్తి మనకు ఉంది” అని మోదీ అన్నారు.
చైనాకు మాత్రం ఉపేక్ష
రష్యా నుంచి భారత్ కంటే ఎక్కువ మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాపై అమెరికా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. భారత్‌పైనే అదనపు సుంకాల రూపంలో ఆర్థిక ఒత్తిడి పెంచడం అన్యాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.