Signal Group Chat Leak: వాషింగ్టన్ కేంద్రంగా తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంచలన వార్త అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన కుటుంబ సభ్యులతో యుద్ధ రహస్యాలను పంచుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తాజా కథనం ద్వారా తెలుస్తోంది.
తాజా వివరాల ప్రకారం, యెమెన్‌పై చేపట్టిన భీకర వైమానిక దాడులకు ముందే సంబంధిత ప్రణాళికలు సిగ్నల్ యాప్‌లోని ఓ ఫ్యామిలీ గ్రూప్‌చాట్ ద్వారా బయటి ప్రపంచానికి అందినట్లు సమాచారం. ఇదే గుంపులో మంత్రి భార్య జెన్సిఫర్, సోదరుడు ఫిల్ హెగ్సెత్ ఉన్నారు. ఇద్దరూ ప్రభుత్వ, మీడియా వ్యవహారాలతో సన్నిహితంగా సంబంధం కలిగి ఉండటంతో… ఈ సమాచార బహిరంగతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకుముందు ‘సిగ్నల్’ యాప్‌లో ఉన్న మరో గ్రూప్‌చాట్ నుంచి కూడా ఈ గోప్యమైన సమాచారం లీకైనట్లు సమాచారం. అందులో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ‘ద అట్లాంటిక్’ చీఫ్ ఎడిటర్ జెఫ్రీ గోల్డ్‌బర్గ్ వంటి ప్రముఖులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చాట్‌లో యుద్ధ ప్రణాళికలపై చర్చించడానికి జెఫ్రీ గోల్డ్‌బర్గ్‌ను దాడికి రెండు రోజుల ముందే చేర్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Chaos at Delhi Airport: చిన్న తప్పు.. 1300 విమానాలు ఆలస్యం అయ్యాయి
ఈ వార్తలపై పెంటగాన్, వైట్‌హౌస్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, హెగ్సెత్‌పై గతంలోనూ ఇటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కథనాలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు, ఆయన భద్రతా భేటీలకు భార్య, సోదరుడిని తీసుకెళ్లేవారని గతంలో వచ్చిన నివేదికలూ మళ్లీ చర్చకు రావడం గమనార్హం.
యెమెన్‌పై మళ్లీ దాడులు – పౌరులే బలి
ఇదిలా ఉండగా, సోమవారం తెల్లవారుజామున యెమెన్ రాజధాని సనాపై అమెరికా మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం 12 మంది పౌరులు మృతి చెందగా, మరో 30 మందికి పైగా గాయపడినట్లు హూతీ రెబల్స్‌కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రక్షణ మంత్రికి బదిలీ డిమాండ్
లీక్ వ్యవహారంపై ఇప్పటికే డెమోక్రాట్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జాతీయ భద్రతకు ముప్పుగా మారేలా వ్యవహరించిన హెగ్సెత్ పదవీ తొలగింపు కోరుతూ సజీవంగా డిమాండ్లు వస్తున్నాయి. ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

