US Airstrikes Nigeria

US Airstrikes Nigeria: నైజీరియాలో ఐసిస్‌ ఉగ్రవాదులపై అమెరికా దాడులు..!

US Airstrikes Nigeria: నైజీరియాలో తిష్టవేసిన ఐసిస్ (ISIS) ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. క్రిస్మస్ పండుగ వేళ వాయువ్య నైజీరియాలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపి భారీ సంఖ్యలో ముష్కరులను మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. “కమాండర్ ఇన్ చీఫ్” హోదాలో తానే స్వయంగా ఈ దాడులకు ఆదేశాలు జారీ చేశానని, నిరపరాధులైన క్రైస్తవులను ఊచకోత కోస్తున్న ఉగ్రవాద వ్యర్థాలపై తమ సైన్యం అత్యంత శక్తివంతమైన, ప్రాణాంతకమైన దాడులు చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు.

చాలా కాలంగా నైజీరియాలో క్రైస్తవ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఐసిస్, బోకో హరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు హింసకు పాల్పడుతున్నాయి. ఈ హత్యాకాండను ఆపకపోతే నరకం చూపిస్తానని గతంలోనే హెచ్చరించినట్లు గుర్తు చేసిన ట్రంప్, ఆ హెచ్చరికలను పట్టించుకోనందునే ఇప్పుడు ఈ ఫలితం అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తన పాలనలో సహించేది లేదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా అమెరికా సైనికులను కొనియాడిన ట్రంప్, చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ “మెర్రీ క్రిస్మస్” అంటూ వ్యంగ్యంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒకవేళ క్రైస్తవులపై దాడులు ఆగకపోతే మున్ముందు ఈ మరణాల సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన హెచ్చరించారు.

Also Read: GHMC: జీహెచ్‌ఎంసీ కొత్తగా 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లతో విస్తరించబడింది..!

అమెరికా రక్షణ విభాగం అయిన ‘యూఎస్ ఆఫ్రికా కమాండ్’ (AFRICOM) కూడా ఈ దాడులను ధ్రువీకరించింది. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు, ఆ దేశంలోని సోకోటో రాష్ట్రంలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారనే ఖచ్చితమైన వివరాలను వైట్ హౌస్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు నైజీరియా ప్రభుత్వం స్పందిస్తూ.. ఉగ్రవాదం తమ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు అనే తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపుతోందని, మతపరమైన కోణంలోనే కాకుండా ఉగ్రవాద నిర్మూలన కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రైస్తవులపై దాడులు జరిగినా ఊరుకోబోమని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ కూడా స్పష్టం చేయడంతో రాబోయే రోజుల్లో ఈ దాడులు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *