F16 Filghter Jet: అగ్రరాజ్యం అమెరికా వైమానిక దళానికి (US Air Force) చెందిన శక్తివంతమైన ఎఫ్-16సీ ఫైటర్ జెట్ (F-16C Fighter Jet) కాలిఫోర్నియాలో కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. యుద్ధ విన్యాసాల ప్రదర్శనలకు పేరొందిన ‘థండర్‌బర్డ్స్’ (Thunderbirds) స్క్వాడ్రన్‌కు చెందిన ఈ ఫైటర్ జెట్, శిక్షణా మిషన్‌లో భాగంగా ఉండగా కూలిపోయింది.
ప్రమాద వివరాలు:
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10:45 గంటలకు, దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ బెర్నాడినో కౌంటీ పరిధిలో ఉన్న ట్రోనా విమానాశ్రయం సమీప ఎడారి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది నెవాడాలోని నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు కేటాయించబడిన ఎఫ్-16సీ ఫైటింగ్ ఫాల్కన్ జెట్. దీనికి కేవలం ఒక ఇంజిన్ మాత్రమే ఉంటుంది.
జెట్ నేలను ఢీకొట్టగానే భారీ ఎత్తున మంటలు చెలరేగి, ఆకాశంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఆ ప్రాంతంలో నాలుగు ‘థండర్‌బర్డ్స్’ విమానాలు ఎగరడం కనిపించిందని స్థానికులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Earthquake: అఫ్గానిస్థాన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం
విమానం కూలిపోవడానికి ముందే, అప్రమత్తమైన పైలట్ పారాచ్యూట్ సాయంతో సురక్షితంగా కిందకు దూకాడు. స్వల్ప గాయాలైన అతడిని వెంటనే రిడ్జెక్రెస్ట్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైమానిక దళం (USAF) ధృవీకరించింది.
ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాటలు:
విమానం కూలిపోతున్న దృశ్యాన్ని 60 ఏళ్ల డారెన్ స్ప్రింగర్ అనే వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించాడు. “పొగలు కమ్ముకుంటూ విమానం ఎడారిలో కూలిపోవడం చూసి గుండె ఆగినంత పనైంది” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దర్యాప్తుకు ఆదేశం:
‘థండర్‌బర్డ్స్’ స్క్వాడ్రన్‌కు చెందిన జెట్ కూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ స్క్వాడ్రన్‌కు మొత్తం ఆరు జెట్‌లు శిక్షణ కోసం కేటాయించగా, అందులో ఒకటి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని యూఎస్ ఎయిర్ ఫోర్స్ సార్జెంట్ జోవాంటే జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఈ ప్రాంతంలో ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ జెట్‌లతో తరచూ యుద్ధ విన్యాసాల శిక్షణలు నిర్వహిస్తుంటుంది.

