Upasana: తాను అథ్లెట్ కాకపోయినప్పటికీ, శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి క్రీడల ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో బాగా తెలుసని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల అన్నారు.
దేశాన్ని ఆరోగ్యవంతంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత త్వరలోనే వాస్తవ రూపం దాల్చుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే.
ఇటీవల విజయవంతంగా ముగిసిన మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సందర్భంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ లీగ్‌ను ఆమె తండ్రి, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ కామినేని నిర్వహించారు. ఈ విజయంపై తన తండ్రికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, క్రీడల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు.
ఆర్చరీ క్రీడకు తన భర్త రామ్ చరణ్ అత్యుత్తమ బ్రాండ్ అంబాసిడర్ అని ఉపాసన ప్రశంసించారు. ఆయన ప్రోత్సాహంతో ఈ క్రీడ మరింత ప్రజాదరణ పొందుతుందని, దాని ద్వారా ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతారని తెలిపారు.
తాను ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకే హాజరయ్యానని, అలాగే తన అత్తమామలు చిరంజీవి, సురేఖల తరఫున ప్రధానమంత్రి మోదీకి బాలాజీ విగ్రహాన్ని బహూకరించానని ఉపాసన వెల్లడించారు.
ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతున్నాయి.