Crime News: ఉత్తరప్రదేశ్ హార్డోయ్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడు ఏళ్లుగా కనిపించకుండా పోయిన భర్త, ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో మరో మహిళతో డ్యాన్స్ చేస్తూ ప్రత్యక్షమవడంతో భార్య షీలూ షాక్‌కు గురైంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.
ఏడు ఏళ్ల క్రితం మొదలైన మిస్టరీ
సాండిలా మురార్ నగర్‌కు చెందిన జితేంద్ర కుమార్ అలియాస్ బబ్లూ, 2017లో షీలూతో వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత వరకట్నం, ఆభరణాలు తేవాలని ఒత్తిడి పెంచి తరచూ భార్యను వేధించేవాడు. షీలూ తల్లిదండ్రులు కోరిక నెరవేర్చలేకపోవడంతో, జితేంద్ర ఆమెను ఇంటి నుండి పంపించేశాడు. దీనిపై షీలూ కుటుంబం వరకట్న వేధింపుల కేసు పెట్టింది.
2018లో షీలూ గర్భవతిగా ఉన్న సమయంలో జితేంద్ర అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. అతని తండ్రి మిస్సింగ్ కేసు పెట్టగా, అనుమానాలు భార్యపై మళ్లాయి. జితేంద్రను హత్య చేసి శవాన్ని దాచేశారని షీలూ, ఆమె కుటుంబంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. షీలూ ఒంటరిగా బిడ్డను పెంచుకుంటూ, భర్త కోసం ఎదురుచూస్తూ కష్టాలు పడింది.
రీల్‌లో బయటపడిన నిజం
2025లో షీలూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఓ పరిచయమైన ముఖాన్ని గమనించింది. లూధియానాలో ఓ మహిళతో కలిసి ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, ఏడు ఏళ్ల క్రితం మాయమైన భర్త బబ్లూనే! షీలూ వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి: AP Cabinet Meeting: నేడే ఏపీ కేబినెట్ భేటీ.. ఈ సమావేశంలో వీటికి ఆమోదం
దర్యాప్తులో జితేంద్ర పంజాబ్‌లో కొత్త పేరుతో జీవనం సాగిస్తున్నాడని, రెండో వివాహం చేసుకుని లూధియానాలో స్థిరపడినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చే అతడి గుట్టును రట్టుచేసింది.
పోలీసుల చర్యలు
శాండిలా సర్కిల్ ఆఫీసర్ సంతోష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, షీలూ ఫిర్యాదు మేరకు జితేంద్రను లూధియానా నుంచి అరెస్ట్ చేశారు. రెండో వివాహం, చీటింగ్, వరకట్న వేధింపుల కేసులు నమోదు చేశారు.
ఏడు ఏళ్లుగా హత్య నిందితురాలిగా ముద్ర వేసుకున్న షీలూ, చివరకు భర్తను బ్రతికే పట్టుకోవడంతో ఊరట పొందింది. ఈ సంఘటన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా శక్తిని మరోసారి చాటిచెప్పింది.
