ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వెలుగుచూసిన ఒక దారుణ హత్యోదంతం కలకలం రేపుతోంది. పెళ్లయిన రెండు నెలలకే జూదంలో డబ్బులు పోగొట్టుకున్నాడనే కోపంతో భర్తను గొంతు నులిమి చంపిన భార్య, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పోలీసులు ఈ కేసులో భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్టు చేశారు.
జనవరి 26న జితేంద్ర యాదవ్ అనే వ్యక్తి తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని మరణించినట్లు వార్తలు వచ్చాయి. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా భావించి కేసు నమోదు చేసినప్పటికీ, పోస్ట్‌మార్టం నివేదికలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. జితేంద్ర గొంతుపై ఉన్న గాయాలు ఉరి వేసుకోవడం వల్ల ఏర్పడినవి కాదని, చేతులతో గొంతు నులమడం వల్ల జరిగినవని వైద్యులు తేల్చారు. ఫోరెన్సిక్ తనిఖీల్లో మృతదేహం ఉన్న తీరు, అక్కడ ఉంచిన స్టూల్ వంటివి ఆత్మహత్యకు పొంతన లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది.
పోలీసుల విచారణ ప్రకారం.. జితేంద్ర, జ్యోతి గత తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుని గతేడాది నవంబర్ 25న వివాహం చేసుకున్నారు. జ్యోతి రోడ్‌వేస్ కండక్టర్‌గా పనిచేస్తోంది. వివాహం జరిగిన కొద్దిరోజులకే జితేంద్ర తన పూర్వీకుల ఆస్తిని అమ్మేసి, తన పేరిట ఇల్లు, కారు కొనాలని జ్యోతి ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీనికి జితేంద్ర నిరాకరించడంతో వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.
హత్య జరిగిన రోజు ఆన్‌లైన్ జూదంలో జితేంద్ర రూ. 20,000 పోగొట్టుకున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో, ఆవేశంలో జ్యోతి అతని గొంతు నులిమి చంపేసింది. భర్త మరణించాడని గ్రహించిన ఆమె, వెంటనే తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారందరూ కలిసి మృతదేహాన్ని గదిలోని వెంటిలేటర్‌కు మఫ్లర్‌తో కట్టి, ఆత్మహత్యగా భ్రమ కలిగించేలా నాటకమాడారు.
అయితే, జ్యోతి ఫోన్ కాల్ డేటా మరియు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు ఆమె తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి వచ్చినట్లు ఆధారాలు లభించాయి. పోలీసుల విచారణలో జ్యోతి తన నేరాన్ని అంగీకరించింది. ఈ కేసులో జ్యోతితో పాటు ఆమె తండ్రి కాళీచరణ్, తల్లి చమేలీలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

