UP govt : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్తి వివరాలను వెల్లడించని 68,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల జనవరి నెల జీతాలను నిలిపివేసింది. తమ కదిలే, స్థిర ఆస్తుల వివరాలను మానవ సంపద పోర్టల్‌లో నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. ఇందుకోసం జనవరి 31ని గడువుగా నిర్ణయించింది.

అయితే, ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ వేల సంఖ్యలో ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను సమర్పించలేదు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం “జీరో టాలరెన్స్” విధానంలో భాగంగా వారి జీతాలను నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్ వర్క్స్ (PWD), రెవెన్యూ, విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమ శాఖల వంటి కీలక విభాగాల్లోనే అత్యధికంగా ఉల్లంఘనలు జరగడం గమనార్హం. చీఫ్ సెక్రటరీ ఎస్.పి. గోయల్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఆస్తుల వివరాలను అప్‌లోడ్ చేసే వరకు ఈ జీతాలు విడుదల కావు.

ఒకవేళ ఇంకా ఆలస్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఫిబ్రవరి నెల జీతం కూడా సకాలంలో అందుతుందనే గ్యారెంటీ లేదని అధికారులు స్పష్టం చేశారు. పరిపాలనలో పారదర్శకతను పెంచేందుకు, అవినీతిని అరికట్టేందుకు ఈ ఆస్తుల వెల్లడి తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *