Unnao Rape Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలిన మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ, శిక్షను నిలిపివేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ (CBI) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Road Accident: అమెరికాలో కారు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ స్టూడెంట్స్ మృతి
విచారణ సందర్భంగా సీబీఐ తన వాదనలను బలంగా వినిపించింది. కుల్దీప్ సింగ్ సెంగార్ వంటి ప్రభావవంతమైన వ్యక్తి బయటకు వస్తే కేసుపై ప్రభావం పడే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని సీబీఐ కోర్టుకు వివరించింది. మైనర్ బాలికపై జరిగిన ఈ నేరంలో నిందితుడికి బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు సెంగార్‌కు నోటీసులు జారీ చేస్తూ, నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తాజా ఉత్తర్వులతో కుల్దీప్ సింగ్ సెంగార్ జైలులోనే కొనసాగనున్నారు. 2017లో జరిగిన ఈ అత్యాచార ఘటనలో సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడిన విషయం తెలిసిందే. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతూ గత కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
