Telangana: ఇప్పటి వరకు డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో ఇలాంటి తీర్పును మనం విని ఉండం. ఆయా కేసుల్లో నిందితులకు వివిధ రూపాల్లో జరిమానా, ఒకరోజు జైలు శిక్ష, కోర్టు ఎదుట ఉంచడం లాంటి శిక్షలు విని ఉంటాం. కానీ ఓ జడ్జి వారం పాటు ఓ వినూత్న తరహా శిక్ష విధించారు. ఇది వారి జీవితంలో మార్పు వస్తుందని భావించి వేసి ఉంటారని, వారి కుటుంబాలకు కనువిప్పు కలుగుతుందని అనుకుంటున్నారు.
Telangana: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ వాహన తనిఖీల్లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 27 మంది పట్టుబడ్డారు. ఆ పట్టుబడిన వారిని పోలీసులు మంచిర్యాల కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ విధించిన ఈ కేసు విచారణలో జడ్జి వినూత్న తరహా తీర్పును ఇచ్చారు. అదేమిటంటే ఇదే రోజు అంటే గురువారం నుంచి వారం రోజుల పాటు అక్కడి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పారిశుధ్య పనులు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది.
Telangana: ఈ తీర్పుతో వారంతా అవాక్కయినా తీర్పును పాటించి తీరాల్సిందే. దీంతో వారిలో మార్పు రావడంతో పాటు, ఇతరుల్లో కూడా మార్పు వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పలుచోట్ల చిన్నపాటి శిక్షలతో బయటపడుతుండటంతో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అందుకే వారం రోజులపాటు ఇలాంటి శిక్షతో ఇక వారు జీవితంలో మళ్లీ ఇలాంటి కేసుల పాలుకాకుండా ఉంటారని భావిస్తున్నారు.

