Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించడం ఒక ‘యజ్ఞం’ వంటిదని అభివర్ణించారు. ఒక ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం చేపట్టడం సామాన్య విషయం కాదని ఆమె అన్నారు. అమరావతిలో 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతికి స్ఫూర్తినిచ్చే నిర్మాణం
నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఒకే చోట ఇన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం చాలా అరుదైన విషయమని తెలిపారు. భవిష్యత్తులో దేశంలో ఎక్కడైనా రాజధాని నిర్మాణం చేపట్టాలంటే, తప్పకుండా అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం వేగం పుంజుకుందని చెబుతూ, ఈ రాజధాని నిర్మాణం బాధ్యతను భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసి అంతా గర్వపడాలని ఆమె అన్నారు.
Also Read: Chandrababu Naidu: దేశం గర్వించేలా అమరావతి నిర్మాణం.. నెక్స్ట్ లెవెల్‌కు రాజధాని
రైతులకు, ఆహార రంగానికి తోడ్పాటు
రాజధాని నిర్మాణానికి భూములిచ్చి గొప్ప త్యాగం చేసిన రైతులకు సేవలు అందించడం బ్యాంకుల యొక్క ప్రథమ బాధ్యతని కేంద్రమంత్రి బ్యాంకర్లకు సూచించారు. రైతులకు ఎలాంటి బ్యాంకింగ్ సమస్యలు లేకుండా వేగంగా పరిష్కరించేలా బ్యాంకర్లు కృషి చేయాలని కోరారు.
అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌ను పండ్లు, కూరగాయల హబ్‌గా తీర్చిదిద్దాలని, ఉత్పత్తుల రవాణాకు సీఎం ఆలోచిస్తున్నారని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర నుంచి అరటికాయలు, తమిళనాడు నుంచి కొబ్బరి రవాణాకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తప్పకుండా ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి
కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా, అమరావతి సైన్స్ పరిజ్ఞానానికి కేంద్రంగా కూడా రూపుదిద్దుకుంటుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆస్ట్రోఫిజిక్స్ వంటి అధునాతన భావనలను అందిపుచ్చుకుంటూ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఆచార్య నాగార్జునుడి రసాయన శాస్త్ర పరిజ్ఞానం గురించి నేటికీ చర్చించుకుంటున్నారంటే ఈ ప్రాంత గొప్పతనం అర్థమవుతోందని ఆమె అన్నారు. విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్‌కు ఎంత వేగంగా సాయం చేయాలో అంతా చేయాలని ప్రధానమంత్రి మోదీ స్వయంగా తనకు చెప్పారని కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.

