Union Cabinet

Union Cabinet: ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

Union Cabinet: దేశ రాజధానిలో రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ను మరో 16 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు రూ. 12,015 కోట్లను కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టును రాబోయే మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విస్తరణ పూర్తయితే ఢిల్లీ మెట్రో మొత్తం నిడివి 400 కిలోమీటర్ల మైలురాయిని దాటి, ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలవనుంది.

తాజా విస్తరణలో భాగంగా మొత్తం 13 కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. వీటిలో 10 స్టేషన్లు భూగర్భంలో (అండర్‌గ్రౌండ్), మిగిలిన 3 స్టేషన్లు ఎలివేటెడ్ పద్ధతిలో నిర్మితమవుతాయి. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం ‘కర్తవ్య భవన్’ వద్ద ఏర్పాటు చేయనున్న కొత్త మెట్రో స్టేషన్. ఇది ఇండియా గేట్, హైదరాబాద్ హౌస్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ భవన్, తెలంగాణ భవన్‌లకు అత్యంత సమీపంలో అందుబాటులోకి రానుంది. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే వారికి, పర్యాటకులకు ప్రయాణం ఎంతో సులభతరం కానుంది.

Also Read: AP News: పల్లె ప్రజలకు సర్కార్ సంక్రాంతి కానుక.. ఇక గ్రామాలకూ అన్న క్యాంటీన్లు!

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ, రిథాలా-బర్వాలా-నరేలా-కుండ్లీ ప్రాంతాలను కలిపే ఈ కారిడార్ ద్వారా ఢిల్లీ, హర్యానా మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. దీనివల్ల రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, సుమారు 33,000 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

మెట్రో విస్తరణతో పాటు వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా క్యాబినెట్ మరికొన్ని భారీ పథకాలకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల నిర్మాణానికి, పీఎం ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో కోటి ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు, ఆధ్యాత్మిక క్షేత్రాలైన కేదార్‌నాథ్, హేమ్‌కుండ్‌లలో రోప్‌వేల నిర్మాణానికి కేంద్రం నిధులను కేటాయించింది. ఈ నిర్ణయాలన్నీ దేశ మౌలిక సదుపాయాల కల్పనలో కీలక మార్పులు తీసుకువస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *