Union Cabinet: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను (RDI) ప్రోత్సహించడంతో పాటు, ఉద్యోగ కల్పన, క్రీడా రంగాల అభివృద్ధికి సంబంధించిన పలు పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు లక్ష కోట్ల నిధి:
కేంద్ర ప్రభుత్వం పరిశోధన- అభివృద్ధి- ఆవిష్కరణ (RDI) పథకానికి రూ.లక్ష కోట్ల భారీ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ప్రైవేటు రంగాన్ని పరిశోధన రంగంలోకి ప్రోత్సహించడం. ప్రైవేట్ కంపెనీలు పరిశోధనలో పెట్టుబడులు పెట్టడానికి ఎదుర్కొనే నిధుల సమస్యలను అధిగమించేందుకు, తక్కువ వడ్డీ రేటుతో లేదా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ అందించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న అనుసంధన్ జాతీయ పరిశోధనా ఫౌండేషన్ పాలక మండలి ఈ పథకానికి దిశానిర్దేశం చేస్తుంది.
ఉద్యోగ కల్పన, ప్రోత్సాహకాల పథకం:
తయారీ రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ‘ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహకాల పథకం’ (Employment Linked Incentive – ELI)కు కూడా క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి రూ.99,446 కోట్లు కేటాయించారు. దీని ద్వారా దేశంలో దాదాపు 3.5 కోట్ల ఉద్యోగాలు, అందులో 1.92 కోట్ల కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి లబ్ధి చేకూరుతుంది.
ఉద్యోగులకు ప్రోత్సాహకాలు: నెలకు రూ.1 లక్ష లోపు జీతం పొందే వారికి ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి రూ.15,000 వరకు ప్రోత్సాహకాలు రెండు విడతలుగా అందిస్తారు. మొదటి 6 నెలల తర్వాత మొదటి కిస్తీ, 12 నెలల తర్వాత రెండో కిస్తీ చెల్లిస్తారు.
యజమానులకు ప్రోత్సాహకాలు: ఉద్యోగాలు కల్పించే యజమానులకు రెండేళ్ల పాటు ప్రతి నియామకానికి నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకం అందిస్తారు. తయారీ రంగంలో మాత్రం ఈ ప్రోత్సాహకాలు మూడు, నాలుగో ఏడాది వరకు కూడా కొనసాగించవచ్చు.
Also Read: pashamylaram: పాశమైలారం ఘటన: మృతుల కుటుంబాలకు రూ. కోటి, సీఎం రేవంత్ రెడ్డి
ప్రావిడెంట్ ఫండ్ (PF) సంస్థలో నమోదు చేసుకుని, 50 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు కనీసం ఇద్దరిని, 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు ఐదుగురు ఉద్యోగులను అదనంగా నియమించి, కనీసం 6 నెలల పాటు కొనసాగించాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారికి మాత్రమే ప్రోత్సాహకాలు అందుతాయి.
జాతీయ క్రీడా విధానం – 2025:
దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడం, క్రీడాకారుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ‘జాతీయ క్రీడా విధానం -2025’కు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా క్రీడా రంగంలో గణనీయమైన పురోగతికి దోహదపడుతుంది.
తమిళనాడులో హైవే విస్తరణ:
తమిళనాడులోని పరమకుడి-రామనాథపురం హైవే విస్తరణకు రూ.1,853 కోట్ల వ్యయంతో ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు కింద 46.7 కి.మీల పొడవైన రహదారిని నిర్మించనున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయాలు దేశ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పన, పరిశోధన, క్రీడా రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించడానికి దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.