Union Budget 2026:అప్పు చేసి పప్పు కూడు.. అన్నది సామెత. అదే సామెతను పాలకులు వంటబట్టించుకున్నట్టున్నారు. అప్పుల కుప్పలు పెంచుకుంటూ పోతున్నారు. ప్రధాన మోదీ హయాంలో కూడా దేశ అప్పు విపరీతంగా పెరుగుతూ వస్తున్నది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న (ఫిబ్రవరి 1న) ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఆ చేదులాంటి నిజం వెల్లడైంది. ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించిన నివేదిక ప్రకారం.. వాస్తవంగా 2019-20లో రూ.101,98,173.64 కోట్లుగా ఉన్న అప్పు.. 2026-27 నాటికి రూ.214,82,050.41 కోట్లకు పెరుగుతుంది. ఈ ఎనిమిదేళ్లలో 112,83,876.77 కోట్ల అప్పుపెరగనున్నదన్నమాట.
Union Budget 2026:దేశ అప్పు 2026 మార్చి 31 నాటికి రూ.197,18,016 కోట్లుగా ఉన్నదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన నివేదికలో పొందుపర్చారు. 2027 మార్చి 31 నాటికి దేశ అప్పు 214,82,050.41 కోట్లకు చేరుకుంటుంది. అంటే ఒక్క ఏడాదిలోనే 17,64,034 కోట్ల మేరకు అప్పు పెరుగుతుందని ప్రభుత్వ బడ్జెట్ లెక్కలే తేల్చి చెప్తున్నాయి. ఇలా లెక్కలేస్తే దేశ ప్రజలకు ఒక్కొక్కరి నెత్తిపై రూ.1.48 లక్షల అప్పు ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. గతేడాది వరకు కేంద్ర ప్రభుత్వం రూ.191 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసిందని తేలింది.
Union Budget 2026:దేశ జీడీపీలో ఇప్పటికే సగానికంటే అధికంగానే అప్పులు చేసిన కేంద్రంలోని ఎన్డీయే సర్కార్.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో కూడా మరిన్ని అప్పులు చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు డేటెడ్ సెక్యూరిటీలు, ఇతర మార్గాల నుంచి రూ.17.2 లక్షల కోట్ల రుణాలను సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
Union Budget 2026:మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని ఆర్థికరంగ నిపుణులు దేశ ప్రజల ముందుంచారు. గడిచిన 67 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వాలు చేసిన అప్పు అంతా కలిసి రూ.55,87,147 కోట్లుగా నిర్ధారించారు. అదే ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తన 11 ఏండ్ల కాలంలో రూ.1,52,85,363 కోట్ల మేరకు అప్పులు చేసిందని తేల్చి చెప్పారు. గత ప్రధానులు ఏటారూ.83 వేల కోట్లు అప్పులు చేస్తే, మోదీ నెలకే రూ.1.10 లక్షల కోట్ల అప్పులు చేశారని వెల్లడించారు.
Union Budget 2026: కేంద్రం వెల్లడించిన అప్పుల లెక్కల అంచనాలపై.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏటా రుణాల వడ్డీలకే రూ.14,03,972 కోట్లను చెల్లించాల్సి వస్తుందని ఆర్థికరంగ నిపుణులు వెల్లడించారు. అంటే నెలకు రూ.1.17 లక్షల కోట్లు అన్నమాట. ఇదిలా ఉండగా, రాబడి, వ్యయాల మధ్య అంతరం పెరిగి భారీ ద్రవ్యలోటుకు దారితీయడంతో దాన్ని పూడ్చేందుకే కొత్తగా రుణాలు తీసుకోబోతున్నట్టు సమాచారం.
