Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026లో తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు భారీ కేటాయింపులు లభించాయి. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో ఏడు కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను కేంద్రం ప్రకటించింది. ఇందులో విశేషం ఏమిటంటే.. ప్రకటించిన ఏడు కారిడార్లలో ఏకంగా మూడు మన హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ ఉండటం.
హైదరాబాద్ టూ బెంగళూరు, చెన్నై, పుణే!
ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే అత్యంత వేగంగా ప్రయాణించేలా ఈ కారిడార్లను డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దక్షిణ భారత్ మరియు పశ్చిమ భారతంలోని ప్రధాన నగరాలకు తక్కువ సమయంలో చేరుకునే అవకాశం కలుగుతుంది. బడ్జెట్‌లో ప్రకటించిన ఆ 7 కారిడార్ల జాబితా ఇదే:
1. హైదరాబాద్ – బెంగళూరు
2. పుణే – హైదరాబాద్
3. హైదరాబాద్ – చెన్నై
4. ముంబై – పుణే
5. ఢిల్లీ – వారణాసి
6. వారణాసి – సిలిగురి
7. చెన్నై – బెంగళూరు
కాలుష్యం లేని వేగవంతమైన ప్రయాణం
పర్యావరణానికి హాని కలగకుండా, కాలుష్య రహిత ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ కారిడార్ల వల్ల కేవలం ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, నగరాల మధ్య ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడతాయి. వ్యాపారవేత్తలకు, ఉద్యోగులకు ఈ హై-స్పీడ్ రైళ్లు ఎంతో మేలు చేయనున్నాయి.
మౌలిక సదుపాయాలకు భారీ నిధులు
ఈ ఏడాది బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం ఏకంగా రూ. 12.2 లక్షల కోట్లను కేటాయించింది. రైల్వేలతో పాటు రాబోయే ఐదేళ్లలో కొత్తగా 22 జాతీయ జలమార్గాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే సరుకు రవాణా కోసం ‘తూర్పు-పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్’ను కూడా ప్రకటించారు. ఇది పశ్చిమ బెంగాల్‌లోని డంకుని నుంచి గుజరాత్‌లోని సూరత్ వరకు విస్తరించి ఉంటుంది.
