Telangana: డిసెంబర్ నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. వచ్చే సంక్రాంతి పండుగ నాటికి పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరుతాయి.. అని రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాజాగా చేసిన కీలక ప్రకటన ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 9 నెలల క్రితమే గడువు తీరిన పంచాయతీలకు అప్పుడే ఎన్నికలు జరపాల్సి ఉండగా, వివిధ కారణాల రీత్యా ఇప్పటిదాకా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు.
Telangana: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, బీసీ సంఘాల డిమాండ్లు, తాజాగా మంత్రి ప్రకటనతో అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనన్న మీమాంస నెలకొన్నది. కులగణన తర్వాతే బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతే పంచాయతీల ఎన్నికలు నిర్వహిస్తామని నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలని తొలి నుంచి బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని బీసీ నేతలు పట్టుబడుతున్నారు.
Telangana: ఓ దశలో బీసీ సంఘాలు పోరాటాలకు దిగాయి. వారి ఒత్తిడికి తలొగ్గిన సర్కారు ఎట్టకేలకు సమగ్ర కులగణనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వేలోనే బీసీల గణన చేపట్టి రిజర్వేషన్లను ఖరారు చేయాలనే యోచనలో ఉన్నది. దీనికోసం బీసీ కమిషన్ ద్వారా వివరాల సేకరణకు పూనుకోగా, కోర్టు జోక్యం చేసుకొని డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది.
Telangana: ఇదే సమయంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిసెంబర్ నెలలోనే పంచాయతీ ఎన్నికలు అంటూ కీలక ప్రకటన చేశారు. దీంతో ఇటు బీసీ వర్గాల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు సర్వే పూర్తికాకుండానే పంచాయతీ ఎన్నికలు ఎలా జరుపుతారంటూ బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో లాగానే రిజర్వేషన్లను అమలు చేస్తే బీసీలకు 23 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరిపితే బీసీ సంఘాలు భగ్గుమనే అవకాశం ఉన్నది.
Telangana: సమగ్ర కులగణనలో బీసీ లెక్కలు తేలుస్తామని, ఆ ప్రకారమే బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తామని చెప్పిన సర్కారు.. ఇప్పుడు కావాలనే పంచాయతీ ఎన్నికలపై ప్రకటన చేసి దోబూచులాడుతున్నదని వివిధ పార్టీలు, బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. అందుకే ఈ డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయా? వచ్చే ఏడాదిలో జరుగుతాయా? అన్నది త్వరలో తేలాల్సి ఉన్నది.


