Ugadi: ప్రపంచవ్యాప్తంగా ఉగాది పర్వదినం జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల శ్రేయస్సును కోరుతూ వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ విశ్వావసు సంవత్సర ఆరంభాన వారు తెలిపిన విశేషాలు తెలుసుకుందాం.
విజయాలు వరించాలి: ప్రధాని మోదీ
Ugadi: ఉగాది పర్వదినం జరుపుకుంటున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఆశ, ఉత్సాహాలతో ఈ పర్వదినం ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగ అని పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, విజయాలను తేవాలని ఆకాంక్షించారు. సంతోషం, సామరస్యాల స్ఫూర్తి వృద్ధి చెందుతూ మరింతగా వర్థిల్లుతుందని మోదీ కోరుకున్నారు.
ప్రతిఒక్కరూ ప్రగతిని సాధించాలి: సీఎం చంద్రబాబునాయుడు
Ugadi: విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ గణనీయమైన ప్రగతిని సాధించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఈ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరమంతా తెలుగు ప్రజలందరిలో సంతోషం నిండాలని, సకల విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలి: సీఎం రేవంత్‌రెడ్డి
Ugadi: ఈ విశ్వావసు సంవత్సరంలో ప్రజల ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజలందరికీ శుభం కలగాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ఈ ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న రేషన్‌కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రజలంతా ఈ పండుగను సంబురంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
సబ్బండవర్గాలకు ఉగాది గొప్ప పర్వదినం: మాజీ సీఎం కేసీఆర్
Ugadi: ఈ ఉగాది పండుగ సబ్బండ వర్గాలకు గొప్ప పర్వదినం అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రజల సాంస్కృతిక జీవనంలో ఆది పండుగైన ఈ ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రైతన్నలు వ్యవసాయ పనులను ఈ పర్వదినా ప్రారంభిస్తారని చెప్పారు. వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమై, సాగు, ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాలుపంచుకుంటారని తెలిపారు.
ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి: వైఎస్ జగన్
Ugadi: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వావసు నామ సంత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి అందరూ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.