UAE: రంజాన్ పర్వదినం సందర్భంగా యూఏఈ జైళ్లలో మగ్గుతున్న 2813 మంది ఖైదీలకు అక్కడి ప్రభుత్వం శుభవార్తను అందించింది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ఖైదీలను రంజాన్ సందర్భంగా విడుదల చేయాలని ఆ దేశాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు వారిలో సుమారు 500 మందికి పైగా భారతీయులు ఉండటం గమనార్హం. వారంతా రంజాన్ పర్వదినం రోజున విడుదల కానున్నారు.
UAE: ఈ మేరకు ఖైదీల విడుదలతో భారత్, యూఏఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇప్పటికే ఖైదీల విడుదలకు చట్టపరమైన విధానాలు ప్రారంభమయ్యాయి. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, అక్కడి పోలీసులు ఈ మేరకు జాబితా ప్రకారం విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్షమాభిక్ష లభించిన ఖైదీల వివరాలను వారి సొంతూళ్లకు చేరవేశారు. దీంతో ఆ ఖైదీలు వచ్చే నెల నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.
UAE: ఖైదీల విడుదల సమయంలో ఆర్థిక బాధ్యతలను కూడా పరిష్కరిస్తామని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హామీ ఇచ్చారు. ఖైదీలు, వారి కుటుంబాలు ఇప్పటి నుంచి స్థిరంగా బతకాలని ఆకాంక్షించారు. వారందరికీ రంజాన్ పర్వదినం శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాన్ని కూడా పంపారు.