Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని బంగ్లా తండాలో గురువారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీ నుంచి మార్బుల్ రాళ్లను దించుతున్న సమయంలో అవి ఒక్కసారిగా మీద పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు స్థానిక యువకుడు కాగా, మరొకరు ట్రాలీ డ్రైవర్ అని పోలీసులు గుర్తించారు.
ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఎంతో బాధాకరంగా ఉంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఖమ్మం నుంచి ఒక ట్రాలీలో మార్బుల్ స్టోన్స్‌ను బంగ్లా తండాకు తీసుకువచ్చారు. ఇంటి వద్ద స్టోన్స్‌ను దించుతున్న సమయంలో అన్ లోడింగ్ సరిగ్గా జరగక, ఆ బరువైన రాళ్లన్నీ ఒక్కసారిగా కింద ఉన్నవారిపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బంగ్లా తండాకు చెందిన బోడ తరుణ్ (25), ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి చెందిన డ్రైవర్ గుగులోత్ అవినాష్ (27) రాళ్ల కింద పడి మరణించారు.
మృతులిద్దరూ 30 ఏళ్ల లోపు యువకులే కావడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లముందే ఉన్న కొడుకులు విగతజీవులుగా పడి ఉండటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
