Rajasthan: కొత్త సంవత్సరం వేడుకల సమయంలో రాజస్థాన్‌లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. ఒక కారులో సుమారు 150 కిలోల అమ్మోనియం నైట్రేట్‌తో పాటు మరికొన్ని ప్రమాదకరమైన పేలుడు వస్తువులను తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో టోంక్ జిల్లా పోలీసులు తనిఖీలు చేపట్టి ఈ కుట్రను అడ్డుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్తున్న ఒక అనుమానాస్పద కారును ఆపి తనిఖీ చేశారు. ఆ కారులో యూరియా సంచుల్లో దాచి ఉంచిన 150 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను చూసి పోలీసులు విస్తుపోయారు. వాటితో పాటు 200 కాట్రిడ్జ్‌లు, సుమారు 1100 మీటర్ల పొడవున్న సేఫ్టీ ఫ్యూజ్ వైర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని బూందీ జిల్లాకు చెందిన సురేంద్ర పట్వా, సురేంద్ర మోచీలుగా గుర్తించారు. ఈ పేలుడు పదార్థాలను బూందీ నుంచి టోంక్ ప్రాంతానికి తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తెచ్చారు? వీటిని ఏదైనా విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేశారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
