Hyderabad: హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్‌లో సోమవారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక వాటర్ ట్యాంకర్ బైక్‌ను బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తి సంతోష్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. తన ఖాళీ సమయంలో కుటుంబ పోషణ కోసం ఆయన పార్ట్‌టైమ్‌గా ర్యాపిడో బైక్ డ్రైవర్‌గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో, విజయనగరం జిల్లాకు చెందిన అక్షిత అనే యువతి తన ప్రయాణం కోసం హుస్సేన్ నడుపుతున్న బైక్‌ను బుక్ చేసుకుంది.
సోమవారం ఉదయం వీరిద్దరూ బైక్‌పై వెళ్తుండగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 సమీపంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక వాటర్ ట్యాంకర్ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి హుస్సేన్, అక్షిత ఇద్దరూ రోడ్డుపై పడిపోయి, తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
