Hyderabad: హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక అపార్ట్మెంట్లోని మూడో అంతస్తు బాల్కనీ అకస్మాత్తుగా కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సీతారాంబాగ్‌కు చెందిన దేవీదాస్ (56), అతని బంధువు వివేక్ (32)గా గుర్తించారు. వీరిద్దరూ ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే:
కుందన్ బాగ్ మెథడిస్ట్ కాలనీలోని శ్రీవాత్స అపార్ట్మెంట్లో నివసించే ద్వారకాప్రసాద్ అనే వ్యక్తి, తన ఇంట్లో కొన్ని ఎలక్ట్రికల్ పనుల కోసం దేవీదాస్, వివేక్‌లను పిలిపించాడు. ముగ్గురూ కలిసి మూడో అంతస్తులోని బాల్కనీలో నిలబడి పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అనుకోకుండా బాల్కనీ స్లాబ్ ఒక్కసారిగా విరిగి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో పైనుంచి కింద పడటంతో దేవీదాస్, వివేక్ అక్కడికక్కడే మరణించారు.
తీవ్ర గాయాలతో యజమాని ఆసుపత్రికి:
ఈ ప్రమాదంలో ఇంటి యజమాని ద్వారకా ప్రసాద్ కూడా కింద పడిపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పంపించారు.
కేసు నమోదు:
తమ వారు అకస్మాత్తుగా మరణించడంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్మెంట్ పాతది కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
