Digital Arrest

Digital Arrest: డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

Digital Arrest: హైదరాబాద్‌లో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయపెట్టి ఒక మహిళ నుంచి ఏకంగా రూ. 1.95 కోట్లు దోచుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌కు చెందిన సయ్యద్ సోయబ్ జాహిద్, బెలిమ్ అనస్ రహీమ్‌లు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాము ప్రభుత్వ అధికారులమని, టెలికాం విభాగం నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికిన వీరు, బాధితురాలి భర్తపై తప్పుడు కేసులు ఉన్నాయని బెదిరించారు. ఆ భయంలో ఉన్న మహిళ నుంచి కోట్లాది రూపాయలను వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లించారు.

పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ నిందితులకు దేశవ్యాప్తంగా సుమారు 22 సైబర్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు తేలింది. వీరి బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా దాదాపు రూ. 3.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరైనా ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెబితే భయపడవద్దని, అసలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని పోలీసులు స్పష్టం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో జాగ్రత్త! మరోవైపు, కొత్త సంవత్సరం వస్తున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. వాట్సాప్‌లో వచ్చే నకిలీ గ్రీటింగ్స్, గిఫ్ట్ ఆఫర్లు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ వంటి లింకులపై క్లిక్ చేయవద్దని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCCSB) హెచ్చరించింది. ఆ లింకులను క్లిక్ చేస్తే తెలియకుండానే మీ ఫోన్‌లో APK ఫైల్స్ ఇన్‌స్టాల్ అవుతాయని, దీనివల్ల మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.

మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు మరియు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఈ లింకులు వాడుతారని పోలీసులు హెచ్చరించారు. భద్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్‌లో ‘టూ-స్టెప్ వెరిఫికేషన్’ ఆన్ చేసుకోవాలని సూచించారు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *