Twins Died: భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పాలు తాగి నిద్ర పోయిన కవల చిన్నారులు గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజే ఇలా జరగడం అందరి హృదయాలను కలిచి వేసింది. గ్రామానికి చెందిన అశోక్, లాస్యశ్రీ దంపతులకు నాలుగు నెలల క్రితం కవలలు (బాబు,పాప) జన్మించారు. శనివారం ఉదయం వీరిద్దరికీ పాలు పట్టించి నిద్రపుచ్చగా వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Donald Trump: భారత ఎన్నికలకు ఆ సంస్థ రూ. 182 కోట్ల నిధులు ఇచ్చింది.. ట్రంప్ సీరియస్ యాక్షన్.. 1,600 మందిపై వేటు
ఉదయం 8.30 గంటలకు ఓసారి.. మరల 11 గంటలకు ఓ సారి డబ్బా పాలు పట్టించి పడుకోబెట్టినట్లు కవలల తల్లి లాస్యశ్రీ వెల్లడించింది. శుక్రవారమే పాల పౌడర్ డబ్బా విప్పి పిల్లలిద్దరికీ పాలు పట్టించినట్లు ఆమె తెలియజేశారు. పిల్లలు నిద్రపోతున్న సమయంలో బాబు ముక్కులోంచి పాలు కారడంతో ఆమె లేపే ప్రయత్నం చేసింది. బాబులో ఎలాంటి స్పర్శ లేకపోవడంతో స్థానిక ఆర్ఎంపి కి చూపించి.. అక్కడి నుండి భూపాలపల్లికి తీసుకెళ్లారు. అప్పటికే పిల్లలిద్దరూ చనిపోయినట్లు వైద్యుడు తెలిపినట్లు వెల్లడించారు. పిల్లలకు ఉపయోగించిన పాలడబ్బాను పరీక్షల నిమిత్తం పంపించినట్లు సమాచారం.